భారతీయుల సంస్కృతిని , సాంప్రదాయాలను అమితంగా ఇష్టపడే కొందరు విదేశీయులు మన దేశానికి స్వయంగా వచ్చి ఎంతో కొంత నేర్చుకుని తిరిగి వెళ్లడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది.తాజాగా అమెరికాకు చెందిన 20 మంది సభ్యులతో కూడిన ఉపాధ్యాయుల బృందం తమ స్టడీ టూర్లో భాగంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వచ్చింది.
వారం రోజుల పర్యటనలో భాగంగా వారు పలు గురుద్వారాలను దర్శించడంతో పాటు సిక్కు మతానికి సంబంధించి పాఠాలను నేర్చుకుంటున్నారు.
ఈ ప్రతినిధి బృందం ఒబెరాయ్ ఫౌండేషన్‌లో భాగం.
వీరు వివిధ విశ్వాసాలు, మతాల గురించి తెలుసుకునేందుకు గాను దేశంలోని వివిధ నగరాలను సందర్శిస్తారు.ప్రస్తుతం గురునానక్ దేవ్ యూనివర్సిటీలో వుంటున్న వీరు సిక్కు మతంపై ఐదు రోజుల లెర్నింగ్ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.
దీనిపై ఆండ్రియా వ్యాట్ మాట్లాడుతూ… తాము హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధమతం, జైన మతం గురించి నేర్చుకోవడం చాలా సంతోషంగా వుందన్నారు.తాము భారతదేశానికి రావడానికి ముందే సిక్కు మతంపై కొంత అవగాహన వుందని.
ఇప్పుడు మరింత తెలుసుకున్నామని ఆండ్రియా తెలిపారు.గురునానక్ దేవ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అమర్జిత్ సింగ్ నిర్వహించిన వర్క్ షాపులో అమెరికన్ ప్రతినిధి బృందం సిక్కు గ్రంథాలు, సిక్కు చరిత్ర, విద్యా సంస్థలు, సిక్కు సాహిత్యం, మత వైవిధ్యంపై సిక్కు దృక్పథాలు వంటి అంశాలను నేర్చుకున్నారు.
15వ శతాబ్ధంలో అవిభక్త భారత్‌లోని పంజాబ్‌లో సిక్కు మతం పుట్టింది.నేడు ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్లకు పైగా ఈ మతాన్ని అనుసరిస్తున్నారు.అధికారిక గణాంకాల ప్రకారం.5,00,000 మంది సిక్కులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నారని అంచనా.1469లో అవిభక్త భారతదేశం (ప్రస్తుత పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్)లోని ఒక హిందూ కుటుంబంలో గురునానక్ జన్మించారు.మెహతా కలు, మాతా త్రిపుర దంపతులు ఆయన తల్లిదండ్రులు.
హిందువుగా జన్మించిన గురునానక్.తత్వవేత్తగా మారి.
అనంతరం సిక్కు మతాన్ని స్థాపించారు.జీవితంలోని రహస్యాలను అన్వేషించేందుకు ఇల్లు వదలిన గురు నానక్ సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణంలో 974 శ్లోకాలను వ్రాశారు.
ఆయన అందించిన బోధనలు ‘‘గురు గ్రంథ్ సాహిబ్’’ (పవిత్ర పుస్తకం)లో ఉన్నాయి.ఇది సిక్కులకు పవిత్ర గ్రంథం.గురు నానక్ తన జీవితం చివరి రోజుల్లో పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ జీవించారు.22 సెప్టెంబరు 1539లో 70వ ఏట పరమాత్మలో ఐక్యమయ్యారు.అందుకే సిక్కులకు కర్తార్‌పూర్ గురుద్వారా పవిత్ర క్షేత్రం.