సాధారణంగా మనం మన ఇంటిలో పూజ చేస్తున్నప్పుడు లేదా ఆలయానికి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా స్వామివారికి పూలు తీసుకొని వెళ్తాము.ఈ విధంగా వివిధ రకాల పుష్పాలను దేవుడు పూజ ఉపయోగిస్తాము.
అదే విధంగా కొన్ని రకాల పుష్పాలతో కొందరు దేవుళ్లకు పూజ చేయడం వల్ల వారి అనుగ్రహం మనపై కల్గి ఎలాంటి కష్టాలు లేకుండా కాపాడతారని భావిస్తారు.అయితే పూజకు పువ్వులు తప్పనిసరిగా ఉపయోగించాలా? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మనం ఆ దేవదేవతుల పూజ చేసే సమయంలో భక్తి పూర్వకంగా, పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే స్వామివారికి పుష్పాన్ని, ఫలాన్ని, జలాన్ని కాని నైవేద్యంగా సమర్పిస్తారో అలాంటి వారి భక్తి నైవేద్యాన్ని భగవంతుడు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత లో తెలియజేశాడు.ఈ విధంగా పరిశుద్ధమైన నిష్కల్మషంగా ఎవరైతే భగవంతుని పూజిస్తారు ఆ భగవంతుడు వారి వెంటే ఉండి అన్నివేళలా కాపాడుతుంటాడు అని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు.

ఈ విధంగా సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు తన రచనలో భాగంగా పుష్పాలను చేర్చాడంటే పూజలో పుష్పాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందుకోసమే పూజలో పుష్పాలు తప్పనిసరి వస్తువులుగా మారాయి.అయితే స్వామివారికి సమర్పించే పుష్పాలను ఎంతో పరిశుభ్రంగా ఉండాలని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.ముఖ్యంగా భగవంతునికి సమర్పించే పుష్పాలను పురిటివారు, మైలవారు బహిష్టులైన స్త్రీలు తాకరాదు.అలాంటి వారు తాకిన పుష్పాలను పూజకు ఉపయోగిస్తే ఆ పూజకు ఫలితం ఉండదు.అదేవిధంగా ముళ్ళు ఉన్న పుష్పాలను, దుర్గంధ భరితమైన పుష్పాలను స్వామివారి పూజకు ఉపయోగించకూడదని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
అదేవిధంగా కొందరు పూల వాసన చూసి దేవుడికి పూలు సమర్పిస్తుంటారు.ఈ విధమైనటువంటి పుష్పాలు సైతం దేవుని పూజకు పనికి రావని ఎంతో శుచిగా, శుభ్రంగా స్నానమాచరించిన తర్వాత పూజకు పువ్వులు కోసుకురావాలని, అలాంటి పుష్పాలతో పూజ చేసినప్పుడు మాత్రమే దైవ అనుగ్రహం మనపై కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.