ఏ నిమిషానికి ఏమి జరుగునో?

నల్గొండ జిల్లా:ప్రజలకు ఏం చేశారని రూ.కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆర్భాటాలతో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.

గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు.70 శాతం గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదని,కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని ఆరోపించారు.తనపై కక్షతోనే నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయడం లేదని విమర్శించారు.

ధరణి ఫోర్టల్ తో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని,కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని ఎత్తివేస్తామని చెప్పారు.తెలంగాణను ఏం అభివృద్ధి చేశాడని సీఎం కేసీఆర్ దేశం గురించి మాట్లాడుతున్నాడని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.

కేసీఆర్ తమ పార్టీతో పొత్తు గురించి అడిగినా తమ అధిష్ఠానం ఒప్పుకోలేదని తెలిపారు.రాష్ట్రంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

భట్టి పాదయాత్ర కోసం సోనియాకు నేను,ఉత్తమ్ లేఖలు రాస్తామని తెలిపారు.నల్గొండలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు తలపెట్టిన కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని కోమటిరెడ్డి చెప్పారు.

Advertisement

తన నియోజకవర్గంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నందున వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు.అయినా నల్లగొండ జిల్లాలో పార్టీ బలంగా ఉందని,ఇక్కడ రేవంత్ రెడ్డి సమావేశాలు పెట్టి సమీక్షలు జరపాల్సిన అవసరం లేదని,పార్టీ బలహీనంగా ఉన్న చోట సమీక్షిస్తే మంచిదని ఉచిత సలహా ఇచ్చారు.

పనిలో పనిగా కాంగ్రేస్ పార్టీలో అభిప్రాయ బేధాలు సహజమేనని చెప్పుకొచ్చారు.దీనితో కాంగ్రేస్ పార్టీలో "ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ"అని పార్టీ శ్రేణులు పరేషాన్ అవుతున్నారు.

Advertisement

Latest Nalgonda News