సమస్యలకు నిలయాలుగా సంక్షేమ వసతి గృహాలు

నల్లగొండ జిల్లా:సకల సమస్యలకు నిలయలుగా సంక్షేమ హాస్టల్స్ దర్శనమిస్తున్నాయని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్ అన్నారు.

జిల్లా కేంద్రంలో శాంతినగర్ బీసీ సంక్షేమ వసతి గృహాన్ని మంగళవారం బీసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించారు.

హాస్టల్ లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి,సమస్యల పై విద్యార్థులనడిగి తెలుసుకుని,వారితో కలిసి ఉదయం టిఫిన్ చేశారు.అనంతరం మాట్లాడుతూ హాస్టల్స్ ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోటు బుక్స్,యూనిఫామ్,బెడ్ సీడ్స్ ఇవ్వకుంటే ఎలా చదువులు సాగుతాయని ప్రశ్నించారు.వార్డెన్లు కొత్త మెనూ ప్రకారం ఆహారం పెట్టకుండా పాత మెనూ అమలు చేస్తున్నారన్నారు.

వసతి గృహంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు బాత్రూమ్స్ నిర్మించాలని, మినరల్ వాటర్ సౌకర్యం కల్పించాలని,జిల్లా కలెక్టర్,స్థానిక ఎమ్మెల్యే సంక్షేమ వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించి,విద్యార్థుల సమస్యలన్నింటిని పరిష్కరించాలని,పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని,నాణ్యమైన భోజనం అందించాలని కోరారు.లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జక్కల మల్లేష్ యాదవ్,యాదగిరి యాదవ్,కొంపల్లి రామన్న గౌడ్,పండ్ల హరికృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News