మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలోనే ఆయన రిట్ పిటిషన్ లో ప్రధాన అంశాలను పేర్కొన్నారని తెలుస్తోంది.
వివేకా హత్య కేసుపై సీబీఐ పేర్కొన్న స్టేట్ మెంట్ లో అన్నీ అబద్దాలే ఉన్నాయని రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు.ఏప్రిల్ 29, 2023న సీబీఐ తన స్టేట్ మెంట్ రికార్డు చేసిందన్న ఆయన తాను ఇచ్చిన స్టేట్ మెంట్ కు విరుద్ధంగా ఛార్జిషీట్ లో పేర్కొన్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో వివక్ష లేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని కోరారు.మార్చి 15, 2019న జగన్ నివాసంలో ఉదయం సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైందని అజయ్ కల్లం తెలిపారు.
సమావేశం మొదలైన గంటన్నర తరువాత అటెండర్ వచ్చి డోర్ కొట్టారన్నారు.ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి బయటకు వెళ్లి తిరిగి వచ్చి జగన్ కు ఏదో చెప్పారన్న ఆయన వెంటనే జగన్ షాక్ కు గురైనట్లుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారన్నారు.
ఇంతకుమించి తానేమీ సీబీఐకి చెప్పలేదని స్పష్టం చేశారు.జగన్ భార్య ప్రస్తావన కానీ మరే ఇతర ప్రస్తావన కానీ తాను చేయలేదని తెలిపారు.
దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి కనిపిస్తుందని ఆరోపించారు.కొందరిని ఇరికించే ప్రయత్నాల్లో భాగంగానే సీబీఐ పని చేస్తోందన్నారు.
ఛార్జిషీట్ లో తాను చెప్పినట్లు పేర్కొన్న అంశాలను కొట్టేయాలని అజయ్ కల్లం తెలంగాణ హైకోర్టుకు విన్నవించారు.కాగా అజయ్ కల్లం రిట్ పిటిషన్ పై హైకోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.