భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈసారి తీవ్రత అధికంగా ఉండటంతో జనాలు బయటకు వెళ్లేందుకు గజగజ వణికిపోతున్నారు.
ప్రజలందరూ కూడా ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా మాస్క్ ధరించడం శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు.గతేడాది ఏప్రిల్ నెలలో ఏ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అంతకు మించి కరోనా పాజిటివ్ కేసులు మరణాలు నమోదవుతున్నాయి.
ఈ క్రమంలో ప్రజలు తమ ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలను వాయిదా వేసుకుంటున్నారు.ముఖ్యంగా పెళ్ళిళ్ళు వాయిదా పడుతున్నాయి.ఈ మహమ్మారి సమయంలో పెళ్ళి తంతు పెట్టుకుంటే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంటుందని చాలామంది పెళ్లి జోలికి వెళ్లడం లేదు.ఐతే కేరళలో వరుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినప్పటికీ వధువు మాత్రం తన పెళ్లిని వాయిదా వేసుకోలేదు.
ముందుగా పెట్టుకున్న ముహూర్తానికి వరుడిని వధువు పెళ్లి చేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి.23 ఏళ్ల అభిరామి కి శరత్మోన్ అనే యువకుడితో గత ఏడాది పెళ్ళి నిశ్చయమైంది.ఏప్రిల్ 26వ తేదీన వారి పెళ్లి జరగాల్సి ఉండగా గల్ఫ్ దేశంలో పని చేస్తున్న శరత్మోన్ తన తల్లితో కలిసి కేరళ కి వచ్చారు.
పదిరోజుల వరకు వారిలో ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించలేదు కానీ బుధవారం రోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం తో తల్లి, కొడుకు కలిసి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా ఫలితం వచ్చింది.దీనితో వాళ్ళిద్దరూ అలప్పుజ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో కరోనా చికిత్స పొందుతున్నారు.
అయితే పెద్దల నిశ్చయించిన ముహూర్తానికే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన అభిరామి జిల్లా కలెక్టర్ అనుమతితో ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకుంది.పట్టు చీరకు బదులుగా ఆమె పీపీఈ కిట్ ధరించి అలప్పుజ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకుంది.
అయితే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.