పిల్లలు తమ జీవితంలో ఉన్నత చదువులు చదివి మంచి స్థానంలో ఉండాలని భావించి తమ తల్లిదండ్రులు పిల్లలు చదువు ప్రారంభించడానికి ముందు అక్షరాభ్యాసం నిర్వహిస్తుంటారు.పిల్లలు పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి కావలసినది అక్షరాలు.
ఈ అక్షరాలను మొట్టమొదటిసారిగా నేర్పించడానే అక్షరాభ్యాసం అంటారు.మొట్ట మొదటిసారిగా అక్షరాలు నేర్పించే ఈ కార్యక్రమాన్ని కొందరు ఎంతో వేడుకగా నిర్వహిస్తారు.
అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఐదవ సంవత్సరంలో నిర్వహిస్తారు.అయితే ప్రస్తుత కాలంలో అక్షరాభ్యాసం మూడవ ఏట చేసి పిల్లలను బడికి పంపించడం చూస్తున్నాము.
చదువుల తల్లి సరస్వతి దేవి కనుక అక్షరాభ్యాసం వసంత పంచమి రోజున పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు.ఈ వసంత పంచమి రోజు ఉదయం లేదా సాయంత్రం ఆలయాలకు చేరుకుని పండితులతో పూజలు చేయించి పిల్లల చేత తొలి అక్షరాలను రాయిస్తారు.
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అక్షరాభ్యాసం చేయించే రోజు చదువు దేవతలు అయిన సరస్వతి దేవి, విగ్నేశ్వరుడు దేవతలను పూజించి ఈ కార్యక్రమం నిర్వహిస్తాము.

అక్షరాభ్యాసం 3, 5, 7 సంవత్సరాలలో చేయించాలని 4 సంవత్సరం చేయించకూడదు అని చెబుతుంటారు.అయితే శాస్త్రంలో ఎక్కడ కూడా నాలుగవ ఏట అక్షరాభ్యాసం చేయించకూడదని లేదు.పాడ్యమి, అష్టమి, చతుర్దశీ, పౌర్ణిమ, అమావాస్య రోజులలో మాత్రం అక్షరాభ్యాసం చేయరాదు.
అలాగే అమ్మవారికి పవిత్రమైనదని మూల నక్షత్రం రోజున అక్షరాభ్యాసం చేస్తుంటారు.మూలా నక్షత్రం రోజు కూడా పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించకూడదు.
ఆషాఢం, భాద్రపదం, పుష్య మాసములలోఅక్షరాభ్యాసం చేయించకూడదు.మంగళవారం కూడా అక్షరాభ్యాసానికి నిషేధం.
విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిధులు విశేషం.పునర్వసు, స్వాతీ, అనూరాధ, ఆర్ద్ర, రేవతీ, అశ్వినీ, చిత్త, శ్రవణ నక్షత్రాలు కూడా అక్షరాభ్యాసానికి అనువైనవిగా శాస్త్రం చెబుతోంది.
అక్షరాభ్యాసం కోసం ఎక్కువగా బాసరలోని సరస్వతి ఆలయాన్ని భక్తులు సందర్శిస్తుంటారు.