దీపావళి పండుగ అంటే చీకటిని పారద్రోలుతూ, వెలుగులు విరజిమ్ముతూ అందరి జీవితాలలో కాంతులు నింపే ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.దీపా అంటే దీపము, ఆవలి అంటే వరుస.
దీపాలను వరుసగా అమర్చి ఈ పండుగను జరుపుకుంటారు.దీపావళి పండుగ జరుపుకోవడానికి పురాణాల ప్రకారం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
అయితే వాటి అన్నింటి వెనుక ఉన్న కథ ఏమిటి అంటే చెడును అంతం చేసి విజయాలను పొందినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు.
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటారు.
ఈ పండుగను ఈ సంవత్సరం నవంబర్ 14 వ తేదీన జరుపుకుంటారు.ఈ పండుగ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలను నిర్వహించి, భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని వేడుకుంటారు.
అమావాస్యకు ముందు రోజున నరకచతుర్దశి జరుపుకుంటారు.నరకాసురుడనే రాక్షసుడిని లక్ష్మీదేవి సంహరించడం వల్ల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు.
అంతేకాకుండా కౌరవుల మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 13 సంవత్సరాల పాటు వనవాసం,ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వారి రాజ్యంలోనికి ప్రవేశించినది అమావాస్య రోజున కావడంవల్ల ఆ రాజ్య ప్రజలు ఎంతో ఆనందంగా దీపాలతో వారికి స్వాగతం పలుకుతారు.అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున దీపావళి పండుగ జరుపుకుంటారని మన పురాణాలు చెబుతున్నాయి.

తండ్రి మాటను జవదాటకుండా తన తండ్రి కోరిక మేరకు 14 సంవత్సరాలు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్తాడు.అరణ్యం లో నివసిస్తున్న సీతను రావణాసురుడు ఎత్తుకు పోవడం వల్ల, సాక్షాత్తు ఆ శ్రీ రాముడు రావణాసురుడుని యుద్ధంలో సంహరించి సీతను తీసుకుని సతీసమేతంగా అయోధ్యకు బయలుదేరింది కూడా ఆశ్వయుజ అమావాస్య రోజున కావటంవల్ల అక్కడి ప్రజలు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపాలను వెలిగించి ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు.
శరదృతువు లో వచ్చే దీపావళి పండుగకు రైతులు పండించిన పంట కోతలు పూర్తిచేసుకొని ధాన్యం ఇంటికి చేరుతుంది అందువల్ల రైతులు సంతోషంగా ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటారని మన పురాణాలు చెబుతున్నాయి.దీపావళిని జరుపుకోవడానికి ఇలా ఎన్నోకథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కటి కూడా చెడును సంహరించే విజయంతో అడుగు పెట్టడం వల్ల ఈ పండుగను విజయానికి గుర్తుగా ప్రజలందరూ నాటి నుంచి నేటి వరకు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు.