బిడ్డ చదువు కోసం కష్టపడి దాచుకున్న సొమ్ము కొట్టేసిన దొంగలు

నల్లగొండ జిల్లా:రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కూలీ కుటుంబం తమ పిల్లల చదువు కోసం ఒక్కో రూపాయి ఎల్ఐసిలో పొదుపు చేసుకుని, బిడ్డ కాలేజీ ఫీజు,బుక్స్ ఇతర అవసరాల కోసం బ్యాంక్ నుండి డ్రా చేశారు.

డబ్బు ద్విచక్ర వాహనం డబ్బాలో పెట్టుకొని,కూతురుకి బ్యాగ్ కొనేందుకు షాపులోకెళ్ళి వచ్చేలోగా మాయం చేసిన ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోచోటుచేసుకుంది.

పోలీసులు,బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.నల్లగొండ రూరల్ మండలం పెద్దసూరారంగ్రామానికి చెందిన గుండె వెంకన్న దంపతులు తమ బిడ్డ చదువు కోసం ఎల్ఐసిలో దాచుకున్న రూ.80 వేలు శుక్రవారం నల్లగొండ గడియారం సెంటర్లో గల సెంట్రల్ బ్యాంకు నుంచి డ్రా చేశారు.తమ ద్విచక్ర వాహనం డబ్బాలో పెట్టుకొని,ప్రకాశం బజార్ లో కాలేజీ బ్యాగ్ కొనేందుకు షాపులోకి వెళ్ళారు.వీరిని గమనిస్తున్న దొంగలు ప్రకాశం బజార్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో చుట్టుపక్కల కెమెరాలకు చిక్కకుండా గొడుగు అడ్డుపెట్టి ద్విచక్ర వాహనం బాక్స్ తాళాన్ని గట్టిగా గుంజి అందులో ఉన్న రూ.80 వేల నగదు అపహరించుకొని పరారయ్యారు.బయటికి వచ్చిన వెంకన్న స్కూటర్ డిక్కీ తెరిచి ఉండడం,అందులో సొమ్ము కనిపించకపోవడంతో గుండెలు పగిలేలా రోధించాడు.

తన కూతురి భవిష్యత్తు కోసం కూలీనాలీ చేసి ఒక్కోరూపాయి కూడబెట్టిన డబ్బులు ఎత్తుకెళ్లారని కన్నీటి పర్యంతమవుతూ తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.సమాచారం అందుకున్న నలగొండ వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల గల సీసీ కెమెరాలు పరిశీలించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
దేవరకొండ యువతి గిన్నిస్‌ బుక్‌ రికార్డు

Latest Nalgonda News