హస్తం పార్టీలో పెరుగుతున్న ఆశావాహులు.తనకే సీటు గ్యారంటీ అంటూ ఎవరికి వారే ప్రచారం.
ఇద్దరు నేతల మధ్య పొసగని సఖ్యత.ఇంటిపోరుతోనే సతమతమవుతుంటే ఇంటిపార్టీ పోరు తోడైంది.
నియోజకవర్గంలో వరంగల్ డిక్లరేషన్ పై ఉత్కంఠ.రచ్చబండ కార్యక్రమానికి పోటా పోటీగా బలప్రదర్శన.
ఇంటి పార్టీని హస్తంలో విలీనం చేస్తా ఎమ్మెల్యే టికెట్ నాకే అంటున్న చెరుకు.టీపీసీసీ నకిరేకల్ లో ఎవరు వైపు మొగ్గనుంది?.అయోమయ స్థితిలో నకిరేకల్ హస్తం శ్రేణులు.
నల్లగొండ జిల్లా:జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట.కాంగ్రేస్, కమ్యూనిస్టుల హోరాహోరీ పోరుతో జిల్లా రాజకీయ యవనికపై నకిరేకల్ ఓ చెరగని సంతకం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు కురువృద్ధుడు నర్రా రాఘవ రెడ్డి,కాంగ్రేస్ నేత నేతి విద్యాసాగర్,నోముల నరసింహయ్య వంటి మహామవులను అందించిన ప్రాంతం.ఎందరో నాయకులకు రాజకీయ ఓనమాలు నేర్పిన నకిరేకల్ కు రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు.
నర్రా రాఘవరెడ్డి అనంతరం కాంగ్రేస్ కంచుకోటగా మారిన నకిరేకల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తన ఉనికిని చాటుకుంది.కానీ,ప్రస్తుతం ఇక్కడ కాంగ్రేస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కాంగ్రేస్ సీనియర్ నేత,మాజీ మంత్రి,ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్లగొండ జిల్లాలో హస్తం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్ ముఖ్య అనుచరుడుగా ఉన్న చిరుమర్తి లింగయ్య 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గెలిచి కాంగ్రేస్ పట్టు తగ్గలేదని నిరూపించాడు.
కానీ, గుంపులో గోవిందయ్యాలగా చిరుమర్తి హస్తనికి హ్యాండిచ్చి కారెక్కడంతో కాంగ్రేస్ కథ అడ్డం తిరిగింది.లిడర్ పార్టీ మారినా క్యాడర్ పార్టీని పట్టుకుని ఉందని భావిస్తున్న తరుణంలో నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో టచ్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే నల్లగొండ జిల్లాకే చెందిన మరో రాజకీయ కురువృద్ధుడు,మాజీ సీఎల్పీ నేత,కుందూరు జానారెడ్డి ముఖ్య అనుచరుడు కొండేటి మల్లయ్య ఇక్కడి నుండి మూడు దఫాలుగా ఎమ్మెల్యే టికెట్ ఆశించినా అవకాశం దక్కలేదు.ప్రస్తుతం ఆయన కాంగ్రేస్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండడంతో హస్తం అభ్యర్థి నేనే అంటూ పలు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ దూసుకెళుతున్నాడు.
కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడైన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరాక మరో ముఖ్య అనుచరుడు దైద రవీందర్ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అండతో పార్టీ టిక్కెట్ తనకేనంటూ పార్టీలో వివిధ కార్యక్రమాలతో హడావుడి చేస్తూ ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగానే పోటీ పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.హస్తంలో పార్టీలో ఇప్పటికే ఈ ఇద్దరి నేతల మధ్య వర్గపోరు ఓ స్థాయిలో నడుస్తుంది.
అయితే ఈ ఇద్దరిలో అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇస్తుందో,ఎవరికి సహకరించాలో తెలియక పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.ఇది చాలదన్నట్లు నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు,తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ కూడా నకిరేకల్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తన ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి,ఎస్సీ రిజర్వుడు కోటాలో తన భార్య చెరుకు లక్ష్మీని బరిలో దింపుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.దీనితో నకిరేకల్ హస్తంలో ఈసారి ట్రైయాంగిల్ పోరు తప్పేలా లేనట్లుంది.
అయితే టీపీసీసీ ఆదేశాల మేరకు పార్టీ కార్యాచరణ అత్యంత శరవేగంతో ముందుకు దూసుకుపోతూ పలు కార్యక్రమాలకు శ్రీకారం చూడుతూ రచ్చబండ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.అయితే పార్టీ అధిష్టానం మేరకు రచ్చబండ కార్యక్రమానికి పార్టీ సీనియార్టీ బట్టి జిల్లా ఇన్చార్జిగా ఒకరిని నియమిస్తున్నారు.
కానీ,నల్గొండ జిల్లాకు మాత్రం ఇంకా ఇంచార్జీని నియమించకపోవడం గమనార్హం.అయితే ఈ నియోజకవర్గం నుండి ఇప్పటికైతే ఇద్దరు నేతలు మాత్రమే కాంగ్రెస్ క్యాడర్ ను కలుస్తూ ఎవ్వరికి వారే యమునా తీరే అన్న చందంగా పోటాపోటీగా రచ్చబండ కార్యక్రమాలకు హాజరౌతూ టికేట్ డిక్లరేషన్ కోసం ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.
కొండేటి వర్సెస్ దైద రాబోయే సాధారణ ఎన్నికల్లో నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ తనకంటే తనకే అని పోటాపోటీగా ప్రచారం చేసుకుంటూ కొండెటి మల్లయ్య,దైద రవీందర్ లు అధిష్టానం ఇచ్చిన రచ్చబండ పిలుపులో భాగంగా హడావుడి చేస్తున్నారు.నకిరేకల్ పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దైద సుందరయ్య వారసునిగా తాను కూడా ప్రజలకు సేవ చేస్తానని దైద రవీందర్ చెబుతుంటే,ఇదే నియోజకవర్గానికి చెందిన తాను కూడా కాంగ్రెస్ నుండి టికెట్ ఆశిస్తూ పార్టీ సీనియర్ నాయకుడిగా కోమటిరెడ్డి బ్రదర్స్,జానారెడ్డి అండదండలతో పని చేస్తున్నానని,పార్టీలో సీనియర్ నేతగా మూడు దఫాలుగా నకిరేకల్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎదురు చూస్తున్నానని,మూడు దఫాలుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ అధిష్టానం మేరకు ఎవరితో కలిసి పని చేయాలన్నా కలిసి పనిచేశానని,కాంగ్రెస్ లో వర్గ భేదాలు ఏమైనా ఉండొచ్చు కానీ,టిపిసిసి ఆదేశానుసారం పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి పని చేస్తానని కొండెటి మల్లయ్య అంటున్నారు.
ఇంటి పోరు ఇలా ఉంటే మరో తలనొప్పి ఇంటి రూపంలో హస్తాన్ని అతలాకుతలం చేస్తుంది.ఇంటి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా టికెట్ నాకేనని ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ రంగంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమకారుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన డాక్టర్ చెరుకు సుధాకర్,కేసీఆర్ తో పడక తెలంగాణ ఇంటి పార్టీ స్థాపించారు.అనుకున్న స్థాయిలో పార్టీకి గుర్తింపు రాకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపి ఇంటి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ఆయన పలుమార్లు మీడియా ముఖంగా చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే నకిరేకల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కాబట్టి డాక్టర్ చెరుకు సుధాకర్ భార్య లక్ష్మి కి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.అయోమయంలో క్యాడర్ వరంగల్ డిక్లరేషన్ తో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ ప్రకటించడంతో క్యాడర్ లో జోష్ పెరిగింది.
దీంతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం నుంచి నెల రోజుల పాటు రచ్చబండ పేరుతో విస్తృత ప్రచారం చేపట్టి పార్టీకి లాభం చేకూర్చని ప్రకటించారు.కానీ,నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ లీడర్ లు మాత్రం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
వీరి వ్యవహారంతో కాంగ్రెస్ కేడర్ అయోమయ పరిస్థితిలో పడింది.సమావేశాలు సభలు ఏకతాటి మీద నిర్వహిస్తామని చెప్పి కార్యక్రమాలను నిర్వహించకపోవడం క్రింది స్థాయి నాయకులకు రుచించడం లేదు.
ఏదైనప్పటికీ లీడర్లు వ్యవహార తీరుతో జిల్లాలో పార్టీకి భంగపాటు తప్పదని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఈ విషయంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా జలంధర్ రెడ్డి స్పందిస్తూ పార్టీలో వర్గ విభేదాలు ఏమైనా ఉండొచ్చు.
పార్టీ అధిష్టానం టిపిసిసి పిలుపు మేరకు నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికలకు దైద వర్సెస్ కొండేటిని అభ్యర్థిలుగా ఎవరిని ప్రకటించినా మేం కలిసి పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం.తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నాం అంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ పలుమార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి.
అయితే తెలంగాణలో ఏ నియోజకవర్గ పరిధిలో ఏ నిర్ణయం తీసుకోవాలో పార్టీ అధిష్టానం చూసుకుంటుంది.ఇదంతా చూస్తుంటే నకిరేకల్ నియోజకవర్గ హస్తం పార్టీలో నేతలే కాదు వారి చేతిలో రేఖలు కూడా కలిసేలా లేవని నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
ఈ కలహాల కాపురాన్ని అధిష్టానం ఎలా అధిగమిస్తుందో చూడాలి మరి!!.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy