రోజురోజుకీ పెరిగిపోతున్న టెక్నాలజీ లాభాలతోపాటు ఎన్నో నష్టాలను తెచ్చిపెడుతోంది.ముఖ్యంగా నేటితరం మొబైల్ ఫోన్స్ కి ఎలా బానిసలు అయిపోతున్నారో మనం చూస్తూ వున్నాం.
స్మార్ట్ ఫోన్ల మధ్య వారు పెరుగుతున్నారు.ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్రకూడా వుంది.
ఒకప్పుడు చిన్న పిల్లలను ప్రత్యేకించి ఆడించేవారు తల్లిదండ్రులు.నేటి కాలంలో తల్లిదండ్రులిద్దరూ ఎవరి పనులలో వారు బిజీ అయిపోయి, పిల్లలను పట్టించుకోవడం మానేస్తున్నారు.
వారితో వేగలేక వారికీ మొబైల్ ఫోన్స్ అలవాటు చేస్తున్నారు.
అలాంటి అలవాట్లే ఇపుడు కొంప ముంచుతున్నాయి.ఓ పిల్లాడు తన తండ్రి మొబైల్లో ఆన్లైన్ గేమ్ ఆడి ఏకంగా రూ.39 లక్షలు పోగొట్టాడు.ఉత్తర్‌ప్రదేశ్‌లోని జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే, ఆగ్రాలోని తాజ్‌నాగ్రికి చెందిన ఓ విశ్రాంత సైనికుడి కుమారుడు.తన తండ్రి మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండేవాడు.ఈ క్రమంలోనే ఆ పిల్లాడు తన తండ్రి మొబైల్లో బ్యాటిల్ గ్రౌండ్ అనే ఆన్లైన్ పెయిడ్ గేమ్‌ను ఇన్స్టాల్ చేశాడు.
ఆ తర్వాత డబ్బులు చెల్లించే ఆప్షన్‌ను ఆటోమోడ్లో పెట్టాడు.
అలా పిల్లాడు చాలా సార్లు ఆ గేమ్ ఆడాడు.ఆడిన ప్రతీసారి ఆటోమోడ్లో డబ్బులు చెల్లింపు అయ్యేవి.అయితే అది తన తండ్రి గమనించలేదు.కొన్ని రోజుల తరువాత పిల్లాడి తండ్రి తన బ్యాంకు ఖాతాలో డబ్బులు చెక్ చేయడానికి వెళ్లగా… రూ.39 లక్షలు మాయమైనట్లు తెలుసుకున్నాడు.దీనిపై సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు.బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి సింగపూర్‌లోని క్రాఫ్టన్ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు.బాధితుడి ఫిర్యాదు మేరకు క్రాఫ్టన్ కంపెనీపై మోసం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.