ఎప్పటి నుంచో తెలంగాణ అంతట పాదయాత్ర నిర్వహించి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో రేవంత్ పాదయాత్ర వాయిదా పడుతూనే వస్తోంది.ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయి.అనేక రకాల ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సీనియర్ నాయకులు పార్టీ అధిష్టానం పై అసంతృప్తి తో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడం, వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దడం వంటివి జరిగాయి.ఇక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్యం ఠాగూర్ స్థానంలో మాణిక్ రావు ఠాక్రే బాధితులు స్వీకరిస్తున్నారు.
ఈ క్రమంలో రేవంత్ పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్దం అయింది.
ఈనెల 26వ తేదీ నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించనున్నారు.
భద్రాచలం సీతారామచంద్రమూర్తి దర్శించుకున్న అనంతరం రేవంత్ పాదయాత్రను మొదలుపెడతారు. మొత్తం 126 రోజుల పాటు పాదయాత్రను చేపట్టే విధంగా ప్లాన్ చేశారు.
మే నెల చివరి , జూన్ మొదటి వారంలో పాదయాత్ర పూర్తయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించారు .
మొత్తం 99 నియోజకవర్గాలను ఈ పాదయాత్ర ద్వారా కవర్ చేసే విధంగా రూట్ మ్యాప్ రేవంత్ సిద్ధం చేసుకున్నారు .రోజుకి 18 కిలోమీటర్లు ప్రయాణించే విధంగా పాదయాత్ర షెడ్యూల్ తయారయింది.భద్రాచలంలో మొదలగుతున్న పాదయాత్రను ఆదిలాబాద్ లో ముగించే విధంగా ప్లాన్ చేశారు.
హథ్ సే హత్ సే జోడో కార్యక్రమం ద్వారా ఈ పాదయాత్రను రేవంత్ రెడ్డి చేపట్టనున్నారు.
కాంగ్రెస్ వ్యూహ కర్త సునీల్ కానుగోలు ఆధ్వర్యంలోనే ఈ రూట్ మ్యాప్ సిద్దమైనట్లు సమాచారం.అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో అధికారికంగా అనుమతి వచ్చిన తర్వాత ఈ పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించేందుకు రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు.రేవంత్ పాదయాత్రకు అధిష్టానం నుంచి అనుమతి లభిస్తే ఎప్పటినుంచో రేవంత్ చేపట్టాలనుకున్న పాదయాత్ర కోరిక కూడా తీరిపోనుంది.