ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ జిల్లా:ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనపై సోమవారం కలెక్టరేట్ నుండి ఆమె సంబంధిత జిల్లా,మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని, నల్గొండ జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 3 లక్షల 60 వేల 205,పట్టణ ప్రాంతంలో 71,626, మొత్తం 4,31,831 దరఖాస్తులు రావడం జరిగిందన్నారు.ఈ దరఖాస్తులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్ ద్వారా గ్రామ పంచాయతీల్లో కార్యదర్శిలు,మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు పరిశీలించాలని,పంచాయతీ కార్యదర్శి,వార్డ్ అధికారి లేనిచోట టీఎ లేదా నియమించిన ఇతర అధికారులు దరఖాస్తులను పరిశీలించాలన్నారు.

Review Of Indiramma House Applications Should Be Completed By The End Of This Mo

జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలు,182 వార్డు పరిధిలలో పంచాయతీ సెక్రటరీలు, వార్డ్ ఆఫీసర్లు ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన కార్యక్రమాన్ని నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు.ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని,ఇందిరమ్మ కమిటీలు సైతం పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనను పరిశీలించవచ్చన్నారు.

దరఖాస్తుదారు బిపిఎల్ వర్గం,ప్రస్తుత నివాస గృహానికి సంబంధించిన పూర్తి వివరాలు,కులం, చిరునామా వంటి వివరాలతో పాటు,ప్రస్తుత ఇంటి దగ్గర తీసుకున్న ఫోటో,ఇంటి పరిస్థితిపై లోపల,బయట ఫోటోలు, అలాగే కొత్తగా నిర్మించతలపెట్టిన స్థలం, దానికి సంబంధించిన పూర్తి వివరాలను మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్,గృహ నిర్మాణశాఖ పిడి రాజకుమార్,జెడ్పి సిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి,ఈడి ఎం.దుర్గారావ్,ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు,ఎంపీఓలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు,వార్డు అధికారులు,సర్వేయర్లు, తదితరులు హాజరయ్యారు.

Advertisement

Latest Nalgonda News