ముడుపులు చెల్లిస్తేనే ముందు బీసీ లోన్ల దరఖాస్తు...!

నల్లగొండ జిల్లా: బీసీ సామాజిక వర్గాల్లోని కొన్ని కులాలకు లక్ష రూపాయలు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

దాని కోసం ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన కుల,ఆదాయ ధ్రువపత్రాల కోసం బీసీలు అనేక వ్యయ ప్రయాసలకోర్చి, తహసిల్దార్ కార్యాలయ సిబ్బందికి,మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు చేతులు తడిపి సర్టిఫికెట్స్ పొందారు.

అనంతరం అన్ని సర్టిఫికెట్స్ తో దరఖాస్తు చేసుకోడానికి తహశీల్దార్ కార్యాలయాలకు వెళితే అక్కడ వారికి ముడుపులు చెల్లిస్తేనే ముందు దరఖాస్తు చేస్తామనే పద్దతిలో రెవిన్యూ అధికారుల పద్దతి ఉండడం గమనార్హం.నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ఉదయం నుండి రాత్రి 10 గంటల వరకు మహిళలు బారులు తీరిన వైనం అనేక విమర్శలకు దారితీసింది.

ఈ సందర్భంగా మహిళలు మాట్లడుతూ కేతేపల్లి మండలంలోని చుట్టుపక్క గ్రామాల నుండి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని వస్తే ఆఫీసు సిబ్బంది సీరియల్ ప్రకారం ఆన్లైన్ చేయకుండా ముందుగా ముడుపులు ఇచ్చిన వారికి చేస్తున్నారని ఆరోపించారు.ఇక్కడ నగదు రూపంలో ఇస్తే తెలిసిపోతుందని ఫోన్ పే,గూగుల్ పే ద్వారా ముడుపులు పుచ్చుకొని సీరియల్ లో పెట్టిన వాటిలో ఫోనులో సెటిల్మెంట్ చేసుకున్న వారివి ఆన్లైన్ చేస్తూ మిగతా వారిని పట్టించుకోవడం లేదని వాపోయారు.

ఉదయం నుండి తిండి తిప్పలు లేకుండా చిన్నపిల్లలతో పడిగాపులు కాస్తున్నా, రాత్రి పది దాటినా మహిళలు అనే ధ్యాస కూడా లేకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
అమెరికా అధ్యక్ష ఎన్నికలు .. కమలా హారిస్‌ తరపున జో బైడెన్ ప్రచారం, శ్రేణుల్లో జోష్

Latest Nalgonda News