ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కురుస్తున్న అగ్నివర్షం

నల్లగొండ జిల్లా:గత రెండు రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భానుడి ప్రతాపానికి అగ్ని వర్షం కురుస్తుంది.

మండిపోతున్న ఎండలతో పాటు ఊపిరాడని ఉక్కపోత,వడగాలులతో జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోతుంది.

ఓ పక్క గత వర్షా కాలంలో సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి బోర్లు,బావులు, చెరువులు,కుంటలు ఎండిపోయి సాగు,తాగు నీరు లేక ప్రజలు,పశు,పక్ష్యాదులు అల్లాడుతుంటే మరోపక్క సూర్య భగవానుడు నిప్పుల కొలిమై భగాభగా మండిపోతూ ప్రచండ భానుడై కురిపిస్తున్న అగ్నివర్షానికి తాళలేక బయటికి వెళ్ళాలంటే భయంతో వణికిపోతున్నారు.ఈ నేపథ్యంలో మనుషులు, జీవరాశులే కాదు వాహనాలు కూడా వేడిని భరించలేక మంటల్లో కాలిపోతున్నాయి.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ అశోక్ నగర్ కాలనీ రోడ్డులో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ కి చెందిన బొలెరో వాహనం(TS05UE 4865)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ప్రమాద సమయంలో వాహనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు.

రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాలో బుధవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.నల్గొండ జిల్లా నిడమనూరులో 44.8 డిగ్రీల సెల్సియస్,సూర్యాపేట జిల్లా మునగాలలో 44.7 డిగ్రీల సెల్సియస్,యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదై డేంజర్ బెల్స్ మోగిస్తుంటే.ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే కాలంలో మే,జూన్ నెలల్లో బ్రతికేదెట్లా అని జనం జంకుతున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే ప్రస్తుత తరుణంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా అత్యవసరమైతే తప్పా బయటికి వెళ్లొద్దని,తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే ప్రయాణాలు చేయాలని వైద్యులు చెపుతున్నారు.ప్రతీ ఒక్కరూ దాహం వేసినా, వేయకపోయినా నిత్యం మంచినీరు తాగుతూ ఉండాలని,ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, వదులైన ఖద్దరు బట్టలు వేసుకోవాలని,గొడుగు,టోపీ లాంటివి వాడాలని సూచిస్తూ వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, లేదంటే డీహైడ్రేషన్ పెరిగి ప్రమాదకర పరిస్థితికి చేరుకొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

రాగల నాలుగు రోజులు వర్షాలే...వర్షాలు..!
Advertisement

Latest Nalgonda News