ఆడపిల్ల ఏ లోటు లేకుండా సుఖపడుతుందని.తమకు కూడా చెప్పుకోవడానికి గర్వకారణంగా వుంటుందనే ఉద్దేశ్యంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఏరి కోరి ఎన్ఆర్ఐ సంబంధాలను వెతుకుతుంటారు.
ఎన్ఆర్ఐ అల్లుళ్ల బాగోతాలపై ఎన్ని వార్తలు వచ్చినా వీరు మాత్రం మారడం లేదు.భారతదేశంలో వున్నప్పుడు ఎంతో హుందాగా, మంచితనం నటిస్తూ అత్తింటి వారిని నమ్మించే కొందరు ఎన్ఆర్ఐలు.
తీరా పరాయి గడ్డ మీద అడుగుపెట్టిన తర్వాత తమ నిజ స్వరూపాన్ని చూపిస్తూ వుంటారు.భార్యలను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు చిత్రహింసలకు గురిచేస్తూ వుంటారు.
కొందరైతే వీరిని విడిచిపెట్టి మరో పెళ్లి చేసుకుంటున్నారు.ఎంతో కష్టపడి పెంచి, అప్పులు చేసి ఘనంగా పెళ్లి చేసిన తల్లిదండ్రుల పరువు పొకూడదనే ఉద్దేశ్యంతో అమ్మాయిలు ఆ బాధను పంటి బిగువన భరిస్తూ వుంటారు.
అటు కన్నవారికి చెప్పుకోలేక.ఇటు భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
కాగా.గడిచిన ఐదేళ్లలో 2300 మందికి పైగా ప్రవాస భారతీయ మహిళల్ని వారి భర్తలు విడిచిపెట్టేశారని భారత ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది.
ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ.మురళీధరన్ సమాధానం చెప్పారు.ప్రభుత్వం వద్ద వున్న డేటా ప్రకారం.తమ భర్తలు తమను విడిచిపెట్టేశారంటూ 2372 మంది ఫిర్యాదులు చేశారని తెలిపారు.ఇవన్నీ గడిచిన ఐదేళ్ల కాలానికి సంబంధించినవేనని మురళీధరన్ వెల్లడించారు.
వివాహమైన ఎన్ఆర్ఐ మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస, వేధింపులు ఇతర వివాదాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మురళీధరన్ వెల్లడించారు.పలు దేశాల్లో వున్న భారతీయ మిషన్‌లు వారి ఫిర్యాదులను పరిష్కరించేందుకు వాక్ ఇన్ సెషన్‌లు, బహిరంగ సమావేశాలను నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.అలాగే అత్యవసర సాయం కోసం 24×7 హెల్ప్‌లైన్‌లను కూడా నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఆపదలో వున్న ఎన్ఆర్ఐ మహిళలకు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ఐసీడబ్ల్యూఎఫ్) కింద ఆర్ధిక, న్యాయ సహాయం కూడా అందజేస్తున్నట్లు మురళీధరన్ పేర్కొన్నారు.భారతీయ మిషన్లే కాకుండా మహిళా సంఘాలు, ఎన్జీవోలు, ఎన్ఆర్ఐ సంఘాలు కూడా బాధిత మహిళలకు సహాయం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా వున్నాయన్నారు.