విశాఖ శ్రీ శారదాపీఠం శివ నామస్మరణతో మార్మోగింది.మహాశివరాత్రి వేడుకలు బుధవారం(ఈరోజు) తెల్లవారుజాము వరకు కొనసాగాయి.
భక్తులంతా హరనామ స్మరణతో పీఠం ప్రాంగణాన్ని హోరెత్తించారు.దీప కాంతులతో రూపొందించిన జ్యోతిర్లింగార్చన శివరాత్రి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
శివ స్వరూపుడు, ఆది గురువు అయిన మేధా దక్షిణామూర్తికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.మహన్యాస పూర్వకంగా సాగిన ఈ అభిషేకంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు 11 రకాల ద్రవ్యాలను వినియోగించారు.
లింగోద్భవ కాలం దాటే వరకు దాదాపు మూడున్నర గంటల పాటు ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు.అనంతరం పరమేశ్వరునికి జ్యోతిర్లింగార్చన చేపట్టారు.
జ్యోతిర్లింగార్చనకు పీఠాధిపతులు హారతులిచ్చి పూజలు చేసారు.ఆతర్వాత చంద్రమౌళీశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేసారు.అనంతరం తాండవ మూర్తి సన్నిధిలో రుద్రహోమం, మృత్యుంజయ హోమం నిర్వహించారు.బ్రహ్మి ముహుర్తంలో హోమాలకు పూర్ణాహుతి చేసారు.
మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులకు పీఠాధిపతులు స్వయంగా ప్రసాదాన్ని పంపిణీ చేసి, శివతత్వాన్ని బోధించారు.శివరాత్రి సందర్బంగా జాగరణ చేసే భక్తుల సౌకర్యార్థం తెల్లవారుజాము వరకు పీఠ ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను తెరిచే ఉంచారు.
విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహించిన మహాశివరాత్రి వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.