అమలాపురం లో దమనకాండ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతోంది.మంత్రి ఎమ్మెల్యే నివాసాలను దగ్ధం చేయడంతో పాటు , బస్సులను తగులబెట్టడం వంటి ఘటనలు సంచలనం రేపాయి.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో జిల్లా పేరు మార్పు వ్యవహారం అగ్గి రాజేసింది.అసలు ఈ దమనకాండ చోటు చేసుకోవడానికి ఎవరు కారణం అనే అంశంపై చర్చ మొదలైంది.
ప్రశాంతంగా ఉండే సీమ ప్రాంతంలో అగ్గి రాజుకోవడానికి కారణం అధికారపార్టీ వైసిపి అని, ముఖ్యంగా మంత్రి పినిపే విశ్వరూప్ అనుచరులు మంత్రి నివాసాన్ని తగులబెట్టారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా.ఈ వ్యవహారం వెనుక టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు.
మీరంటే మీరు దీనికి బాధ్యులు అంటూ రాజకీయ విమర్శలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్నారు.
ఏపీలో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లాను చేస్తూ వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేసింది.
దీనిలో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది.అయితే అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ కోన సీమ జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం ఎక్కువగా ఉండడంతో, ఈ జిల్లాకు కు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి.
జనసేన , టీడీపీలు ఈ డిమాండ్ల ను వినిపించడంతో పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.ఇంకా అనేక ప్రజా సంఘాల నుంచి ఈ డిమాండ్లు వినిపించడంతో , ఏపీ ప్రభుత్వం అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది.
ఇక అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్తత మొదలైంది.కోనసీమ జిల్లాలోనే కొనసాగించాలని అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చు వద్దంటూ కోనసీమ జిల్లా సాధన సమితి పేరుతో కొద్ది రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
దీనికి వివిధ రాజకీయ పార్టీలు సహకరించడం వంటి కారణాలతో ఆందోళన కాస్త హింసాత్మకంగా మారింది.
మొదట్లో అంబేద్కర్ కోనసీమ చేయాలంటూ డిమాండ్ చేసిన జనసేన, టిడిపి ఈ వ్యవహారంలో సైలెంట్ అయిపోయాయి.ఈ ఘటనలో ఏపీ ప్రభుత్వందే తప్పనే విమర్శలు ఈ పార్టీల అధినేతలు నాయకులు చేస్తున్నారు.ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎస్సీ సామాజిక వర్గానికి , కాపు సామాజిక వర్గానికి మధ్య అంతగా సఖ్యత లేదు.
ఇక్కడి ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని వివిధ రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకునే విధంగా ఈ సున్నితమైన విషయంలో ఈ విధంగా ప్రకటనలు చేయడం వంటివి అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లుగా పరిస్థితి తయారయ్యింది .ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే విధంగా రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి … దీనికి కారకులు మీరంటే మీరు అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండడం తో పరిస్థితి ఈ విధంగా తయారయింది.