భారతదేశంలో పసుపు( Turmeric ) అనేది ప్రధాన పంటగా సాగు చేయబడుతుంది.పసుపు వంటకాలలో, సుగంధ ద్రవ్యాలలో, వివిధ రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తూ ఉండడం వల్ల మార్కెట్లో పసుపు కు ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.
కాబట్టి పసుపు పంట పై( Turmeric Crop ) రైతులు పూర్తి అవగాహన కల్పించుకుని సరైన సస్యరక్షక పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడితో పాటు అధిక లాభం పొందవచ్చు.పసుపు పంటకు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువ.
సకాలంలో వీటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి.అప్పుడే అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి.
అయితే పసుపు పంటను ఎలా సంరక్షించుకోవాలో అనే వివరాలు చూద్దాం.
పసుపు పంట వేయడానికి ముందు పొలంలో లోతు దుక్కులు దున్నుకోవాలి.అలా చేస్తే సూర్యరశ్మి( Sun Light ) వల్ల భూమిలో ఉండే చీడ పీడల అవశేషాలు, తెగుళ్ల అవశేషాలు ఏవైనా ఉంటే నాశనం అవుతాయి.తరువాత పొలంలో ఉండే పంట అవశేషాలను పూర్తిగా పొలం నుంచి తొలగించాలి.
ఇక ఆఖరి దుక్కిలో సేంద్రీయ ఎరువులు( Organic Fertilizer ) వేసి కలియదున్నాలి.చాలావరకు రసాయన ఎరువులకు కాకుండా సేంద్రీయ ఎరువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
పంట పొలంలో తరచూ కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.పొలంలో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మొక్కలకు సూర్యరశ్మి, గాలి బాగా తగిలే విధంగా కాస్త దూరంగా విత్తుకోవాలి.
ఇక పసుపు పంటకు దుంప తొలుచు ఈగల బెడద చాలా ఎక్కువ.ఈ ఈగలు పంటను ఆశిస్తే దిగుబడి సగానికి పైగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.ఈ ఈగలు తెలుపు రంగులో ఉంటాయి.
భూమి లోపల ఉండే పసుపు దుంపలోకి ప్రవేశించి దుంపను పూర్తిగా నాశనం చేసేస్తాయి.ఇవి పంటను ఆశిస్తే లేత ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండి రాలిపోతాయి.
ఆ మొక్కలను పీకి గమనిస్తే ఈ పురుగులు కనిపిస్తాయి.ఈ ఈగల నివారణకు ఒక ఎకరం పొలంలో 100 కిలోల వేప పిండిని చల్లాలి.
అలాకాకుండా 10 కిలోల కార్బో ప్యూరాన్ 3జీ గుళికలను ఇసుకలో కలిపి పొలంలో చల్లితే ఈగలు చనిపోతాయి.