బీజేపీ కాంగ్రెస్ లపై గరమైన గుత్తా సుఖేందర్ రెడ్డి...!

నల్లగొండ జిల్లా: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ పదవిలో ఉన్న తాను హాజరు కావడాన్ని రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమంటూ తప్పు పట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.

సోమవారం నల్గొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు.

గవర్నర్ల వ్యవస్థను,కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి పార్టీకి అనుకూలంగా,ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్న విషయం మరిచి మమ్మల్నీ రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారంటూ మాట్లాడడానికి బండి సంజయ్‌కి నైతికర్హత లేదన్నారు.బండి వ్యాఖ్యలు బీజేపీ ద్వంద్వనీతికి నిదర్శనంగా ఉన్నాయన్నారు.

పార్టీ బీఫామ్‌ల పైనే ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు సభాపతులుగా ఎన్నుకోబడతారన్నారు.సభాపతులు ఐదేళ్లుగా పార్టీకి,కార్యకర్తలకు, ప్రజలకు దూరంగా ఉంటే మళ్లీ ఎన్నికల్లో ఎలా గెలుస్తారన్నారు.

ఎన్నికల్లో సభాపతులపై ప్రత్యర్థి పార్టీలు తమ అభ్యర్థులను పోటీ పెట్టరాదన్న చట్టం తెస్తే ఎన్నికైన పార్టీలకు దూరంగా సభాపతులు నడుచుకునే అవకాశం ఉంటుందన్నారు.అలాంటి చట్టబద్ధ అవకాశం లేనప్పుడు రాజకీయ అవసరాల మేరకు సభాపతులు పార్టీ వేదికలపై ముఖ్యమైన కార్యక్రమాల్లోనైనా కనిపించక తప్పదన్నారు.

Advertisement

రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ లు అధికార దాహంతో సీఎం కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాదనడంలో సందేహం లేదన్నారు.

పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆశయమంతా తెలంగాణలో సీఎం పీఠం ఎక్కాలని,రాష్ట్రాన్ని దోచుకోవాలని మాత్రమే అన్నారు.కాంగ్రెస్ పార్టీలో ఐక్యత కప్పల తక్కడ వంటిదన్నారు.

కాంగ్రెస్ నేతల యాత్రలు,సభలు, ప్రియాంక గాంధీ వంటి సభలన్నీ కూడా ఆ పార్టీ నేతల ఐక్యత చాటుకునేందుకు,టికెట్లు సాధనలో బలప్రదర్శనల కోసం నిర్వహిస్తున్నవేనంటూ గుత్తా అభివర్ణించారు.కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలి కడిముంత తరహాలో ఉన్నచోట పొందలేక ఎటుపడితే అటు పడినట్లుగా మాట్లాడుతున్నారన్నారు.

జోకర్ కు తక్కువగా కమెడియన్ కి ఎక్కువన్నట్లుగా వెంకటరెడ్డి వైఖరి ఉందంటూ విమర్శించారు.కేంద్రంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి,దేశానికి చేసింది ఏమీ లేదన్నారు.

వీడియో: పాకిస్థాన్‌లో ప్రాంక్ చేసిన యువకులు.. లాస్ట్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్..?
అపరిచితుడు సినిమా రీమేక్ ఉంటుందా..? శంకర్ ప్లానింగ్స్ ఏంటి..?

రాష్ట్ర విభజన చట్టం హామీలను ఒక్కటి కూడా అమలు చేయని ఆ పార్టీకి తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.కర్ణాటక ఎన్నికల్లో చేసింది చెప్పుకోలేక స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారానికి దిగి చివరకు జై భజరంగబలి అంటూ కార్యకర్త మాదిరిగా మతపర నినాదాలు చేయడం సిగ్గుచేటు అన్నారు.

Advertisement

కాంగ్రెస్,బీజేపీలకు భిన్నంగా తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో దేశానికి దిక్సూచి వంటి పనులను, పథకాలను అమలు చేసి నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందన్నారు.అందుకే సీఎం కేసీఆర్ పాలనపైన,బీఆర్ఎస్ పైన తెలంగాణ ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.

వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలతో మూడోసారి కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు.స్వయం పాలన కోసమే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని,మళ్లీ ఢిల్లీ కేంద్రంగా పనిచేసే బీజేపీ,కాంగ్రెస్ పాలన వస్తే తెలంగాణకు అధోగతి తప్పదన్నారు.

సూట్ కేసుల సంస్కృతికి నెలవైన జాతీయ పార్టీలలో షోకాస్ నోటీసులకు కూడా ఆ పార్టీలు ఢిల్లీ టు హైదరాబాద్ తిరగాలంటూ ఎద్దేవా చేశారు.తెలంగాణ ప్రజల పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపించుకో నున్నారని గుత్తా ధీమా వ్యక్తం చేశారు.

తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.బీఆర్ఎస్ అధిష్టానం,సీఎం కేసీఆర్ మునుగోడు,నల్లగొండ సహా ఎక్కడ పోటీకి నిలబెడితే అక్కడే అమిత్ రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

Latest Nalgonda News