ఏండ్లు గడిచినా గ్రామీణ రోడ్లకు గ్రహణం వీడలేదు...!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా “ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం గ్రామీణ రోడ్లన్నీ అతుకుల గతుకులమయమే"అన్నట్లుగా తయారైంది గ్రామీణ రహదారుల దుస్థితి.

నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని మిర్యాలగూడ -భీమవరం వయా సూర్యాపేట రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ఏండ్లు గడుస్తున్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ పనులు పూర్తి కాక,అడుగడుగునా గుంతలతో,పూర్తి కానీ, కల్వర్టులతో ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.

ఈ రోడ్డు ఇద్దరు ఎమ్మెల్యేలు,ఒక ఎంపి పరిధిలోకి వచ్చినా వారికి పట్టింపు లేక,అధికారుల పర్యవేక్షణ కొరవడి చినుకు పడితే చాలు చిన్నపాటి చెరువులను తలపిస్తూ చిత్తడి భూములుగా మారిపోతూ వాహనదారుల పాలిట శాపంగా మారాయి.కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విస్తరణ పనులను నత్తనడకన కొనసాగిస్తున్నా ఎవరికీపట్టదు.

Even After The Years, The Rural Roads Have Not Been Eclipsed , Eclipsed, Rural R

రోడ్డుకు ఇరువైపులా గుంతలు తీసి సూచిక బోర్డులు పెట్టడం మర్చిపోవడంతో పలు ప్రమాదాలు కూడా జరిగాయి.ఎదురుగా వాహనం వస్తే మరో వాహనం పక్కకు ఆపుకునే దుస్థితి ఏర్పడింది.

రోడ్డుపై సల్కనూర్ పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద పెద్ద గుంతలు, గోదాం వద్ద కల్వర్టు ప్రమాదకరంగా మారి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని దీనికి బాధ్యులు ఎవరని ఆయా ప్రాంతాల ప్రజలు నిలదీస్తున్నారు.ఇదిలా ఉంటే సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అవిరేణికుంట తండా నుండి పెదవీడు వెళ్లే ప్రధాన రహదారి ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

ఈ రహదారికి దశాబ్ద కాలమైనా మోక్షం లభించలేదు.అధికార పార్టీ నాలుగేళ్ల పరిపాలనలో కనీసం మట్టి రోడ్డు కూడా వెయ్యలేని దుస్థితిలో ఉందని తండావాసులు వాపోతున్నారు.

మండలానికి కూతవేటు దూరంలోని అవిరేణికుంటతండా రోడ్డు దుస్థితి ఇలా ఉందంటే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.మా బాగోగులు ఎవరికీ పట్టింపు లేదా?లేక తాము మనుషులమనన్న సంగతి మర్చిపోయారా?గ్రామస్థాయి నుండి అసెంబ్లీ వరకు అధికార పార్టీ నేతలేవున్నా గ్రామాల అభివృద్ధిపై పట్టింపు లేదని మండిపడుతున్నారు.ఎన్నికల సమయంలో అధికారం పార్టీ నేతలు ఓట్ల కోసం గ్రామంలోకి ఎలా వస్తారో చూస్తామని, మరో ఐదేళ్లు ప్రభుత్వం అధికారంలో వస్తే మా తండా కూడాలేకుండా చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాప్రతినిధులు రాజకీయాలు చేస్తుంటే అధికారులు వారికి ఊడిగం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఇదెక్కడి పాలన అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు,అధికారులు స్పందించి భీమవరం రోడ్డు విస్తరణ పనులతో పాటు కల్వర్టుల నిర్మాణం పూర్తి చేసి తారు వేయాలని, అవిరేణికుంట తండా రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

Latest Nalgonda News