మనం ఏ శివాలయాన్ని దర్శించినా ముందుగా శివునికి ఎదురుగా నంది దర్శనమిస్తుంది.శివుని దర్శించుకోవడానికి ముందు భక్తులు నందీశ్వరుని దర్శించుకొని తరువాత శివుడికి పూజలు నిర్వహిస్తారు.
అయితే ముందుగా నంది ని ఎందుకు దర్శించుకుంటారు? శివ లింగం ముందు ఉన్న నందికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? అని చాలా మందికి తెలియక పోవచ్చు.అయితే చాలా మంది శివుడు ప్రమథగణాలలో నందీశ్వరుడు మొదటి వాడు కాబట్టి అంత ప్రాధాన్యత ఇస్తారని చెబుతుంటారు.
అయితే పురాణ కథల ప్రకారం…
పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు.ఎంత జ్ఞానాన్ని సాధించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా అతనికి పిల్లలు లేరనే లోటు ఎక్కువగా ఉండేది.తనకు సంతానం కలగాలని శిలాదుడు ఆ పరమేశ్వరుడికి ఘోర తపస్సు చేశాడు.ఏళ్ళు గడిచి పోయిన ఎండకు, వానకు ఏ మాత్రం తన తపస్సుకు భంగం కలగకుండా ఆ శివుడిపై భక్తితో తపస్సు చేయసాగాడు.
ఈ క్రమంలోనే ఆ పరమేశ్వరుడు శిలాదుడికి ప్రత్యక్షం కాగా అతనికి సంతానం పొందుతాడని వరం ప్రసాదిస్తాడు.ఈ క్రమంలోనే ఒకరోజు శిలాదుడు యజ్ఞం నిర్వహిస్తున్న సమయంలో హోమం నుంచి ఒక బాలుడు ఉద్భవిస్తాడు.
అతనికి నంది అనే పేరు పెడతారు.
శిలాదుడు నందిని ఎంతో అపురూపంగా, అల్లారుముద్దుగా చూసుకునే వాడు.పేరుకు తగ్గట్టుగానే ఆ బాలుడు ఎంతో తెలివితేటలతో, అనేక విద్యలను నేర్చుకున్నాడు.ఒకరోజు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు.
ఆశ్రమంలో ఎంతో అల్లారు ముద్దుగా ఉన్న ఆ బాలుడిని చూసి మిత్రావరుణులు ఎంతో మురిసి పోయారు.నంది వారికి చేసిన సత్కారాలకు మైమరచిపోయి ఆశ్రమం నుంచి వెళుతూ నందిని “దీర్ఘాయుష్మాన్ భవ“అని దీవించ బోయి మధ్యలోనే ఆగిపోతారు.
అలా జరగడానికి కారణం ఏమిటని శిలాదుడు వారిని అడగగా నందికి మరణం తొందరలోనే ఉందనే విషయం తెలియజేస్తారు.ఈ వార్త వినగానే ఎంతో దుఃఖిస్తున్న శిలాదుడునీ చూసి తనకు మరణం లేదని ఆ శివుడి అనుగ్రహం వల్ల జన్మించాను కాబట్టి మరణం లేదంటూ ఆ శివునికి తపస్సు చేస్తాడు.
నంది తపస్సు వల్ల ప్రత్యక్షమైన శివుడు తనకు ఏం వరం కావాలో అని అడగకముందే జీవితాంతం నీ పాదాల చెంత ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని మనసులో అనుకోగా అందుకు శివుడు తధాస్తు అని వరం కల్పిస్తాడు.అప్పటి నుంచి నంది పశువు రూపములో స్వామి వారి పాదాల చెంత ఉంటూ స్వామి వారికి వాహనంగా ఉంటుంది.
నందిని మించిన భక్తుడు ఆ పరమేశ్వరుడికి మరెవరూ లేరు.నందీశ్వరుని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు అతనికి ద్వారకా పాలకుడిగా, ప్రమధ గణాలలో మొదటి వాడిగా ఉంటూ కైలాసాన్ని రక్షిస్తూ ఉంటాడు.
.DEVOTIONAL