కార్తీక మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం.ఈ మాసంలో శివుడు ప్రత్యేక పూజలను అందుకుంటాడు.
ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో సోమవారానికి ప్రత్యేక విశిష్టత కలిగి ఉంది.సోమవారం శివాలయాలలో పెద్ద ఎత్తున అభిషేకాలు నిర్వహిస్తుంటారు.
మరికొందరు సోమవార వ్రతాన్ని ఆచరించి స్వామి కృపకు పాత్రులు అవుతుంటారు.ఇంతటి పవిత్రమైన కార్తీకమాసంలో సోమవారం వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
అందుకు నిదర్శనమే కర్కశ కథ.
మన పురాణాల ప్రకారం పూర్వం నిష్ఠురి అనే మహిళ ప్రవర్తన ఎంతో హేయబద్ధంగా ఉండటం వల్ల అందరూ ఆమెను కర్కశ అని పిలిచేవారు.కర్కశ మిత్రశర్మ అనే వేదపండితుడిని వివాహమాడింది.అయితే తన దుర్మార్గపు ప్రవర్తనతో మిత్రశర్మను ఎన్నో బాధలకు గురి చేసింది.చివరకు ఒక భయంకరమైన వ్యాధితో కర్కశ మరణించింది.ఈ జన్మ పాపం ఫలితమే ఆమె మరో జన్మలో ఒక కుక్కగా జన్మించింది.
అయితే ఒక కార్తీక సోమవారం నాడు పగలంతా ఆ కుక్కకు ఎటువంటి ఆహారం దొరకకపోవడంతో ఎంతో నీరసించిపోయింది.అయితే సోమవారం సాయంత్రం ఒక పండితుడు సోమవారం వ్రతంలో భాగంగా ఉపవాసం ఉండి సాయంత్ర సమయంలో వ్రతం ముగించే సమయంలో భాగంగా అన్నం ముద్దను బయట ఉంచాడు.
అప్పటివరకు ఆహారం దొరకక ఎంతో నీరసించి పోయిన కుక్క వెంటనే వెళ్లి ఆహారాన్ని తినింది.అయితే ఆ ఆహారాన్ని తినడం వల్ల ఆ కుక్కకు గతజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.
వెంటనే ఆ కుక్క మనిషి గొంతుతో గత జన్మ రహస్యం మొత్తం ఆ పండితుడికి తెలియజేసింది.

సోమవారం కఠిన ఉపవాస వ్రతం చేసి ఏమి తినకుండా సాయంత్రం ఆహారాన్ని కుక్కకు పెట్టడం వల్ల గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని పండితుడు తెలియజేశాడు.అయితే ఎలాగైనా తనకు విముక్తి కలిగించాలని వేడుకుంది.ఎన్నో సోమవారాలు ఉపవాసాలు ఉండి సంపన్నుడైనా ఆ పురోహితుడు సోమవార ఫలాన్ని ఆ శునకానికి ధారగా పోయడం వల్ల వెంటనే శునక దేహాన్ని వదిలి పెట్టి, తన పూర్వ శరీరం కైలాసం చేరుకుందని పురాణాలు చెబుతున్నాయి.
అందువల్ల సోమవారం కఠిన నియమాలతో ఉపవాస దీక్షలలో పాల్గొనేవారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.అందువల్ల సోమవారం నియమనిష్టలతో ఉపవాసముండి ఆ శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి, సాయంత్రం సమయాలలో భోజనం చేసేవారి పై శివుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.