కొండకోనలు, సెలయేటి గలగలలు.ప్రకృతి అందాలు.
వీటికి తోడుగా ఆధ్యాత్మిక ఒడిలో కొలువు దీరిన మద్దిలేటి నరసింహ స్వామి క్షేత్రం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.అయితే ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతోన్న కర్నూలు జిల్లాలోని ఈ స్వామి.
కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. స్థల పురాణం.
ఒకరోజు ఆనంద సమయంలో అమ్మవారితో పాచికలు ఆడి స్వామివారు ఓడి పోయారట.విజయ గర్వంతో స్వామిని అమ్మవారు హేళన చేయడంతో ఆయన ఆ అవమానం భరించలేక ప్రశాంత స్థలంలో కొలువు తీరాలని నిశ్చయించుకుంటారు.
ఎర్రమల, నల్లమల అడవులను సందర్శించి చివరికి యాగంటి ఉమామహేశ్వరుడి సలహా అడుగుతారు.
ఆయన సూచనమేరకు మద్దిలేరు వాగు పక్కన కొలువు దీరాలని నిర్ణయించుకుంటారు.
అదే సమయంలో మద్దిలేరుకు మూడు కి.మీ దూరంలోని మోక్ష పట్టణాన్ని కన్నప్పదొర అనే రాజు పరిపాలిస్తుండేవారు.ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్లేవారు.ఓరోజు వేట నుంచి తిరిగి వస్తుండగా తళతళ మెరుస్తూ ఉడుము కనిపించగా దాన్ని పట్టుకోవాంటూ తన పరిచారాన్ని అజ్ఞాపిస్తారు.అది కోమలి పుట్టలోకి ప్రవేశించడంతో దాన్ని పట్టుకోలేక భటులు వెనక్కి వస్తారు.అదేరోజు రాత్రి స్వామివారు రాజుకు స్వప్నంలో కనబడి పగటిపూట ఉడుము రూపంలో కనిపించింది తానేనని.
అర్చక వేదపండితులతో వచ్చి పూజలు నిర్వహిస్తే పదేళ్ల బాలుడి రూపంలో వెలుస్తానని సెలవిస్తారు.
అలా రాజు పూజలు చేయడంతో స్వామి ప్రత్యక్షమై భక్తుల కోర్కెలు తీర్చేందుకు వెలిశానని చెప్పి అదృశ్యం అవుతారు.
అలా మద్దులేరు పక్కన కొలువై ఉండటంతో మద్దులేటి స్వామిగా, మద్దిలేటి నరసింహ స్వామిగా నిత్యపూజలు అందుకుంటున్నారు.బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి 6 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.ప్రతి శుక్ర, శనివారాల్లో జరిగే పూజలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు.
భక్తులు తాము అనుకున్న కోర్కెలు నెరవేరగానే బంధుమిత్ర సమేతంగా క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ.జిల్లాలో స్వామివారి పేరుతో మద్దయ్య, మధు, మధుకిరణ్, మద్దిలేటి, మద్దిలేటమ్మ, మద్దమ్మ, మంజుల, మధనేశ్వరి, మయూరి ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకొని తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు.