ఓటమి నుంచి తెలంగాణ బిజెపి( Telangana bjp ) కోలుకోలేకపోతోంది.పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాము ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎన్ని పర్యటనలు చేసినా, ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చినా, ఘోర పరాజయం ఎదురవ్వడాన్ని తెలంగాణ బిజెపి అగ్రనేతలు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
అసలు తప్పు ఎక్కడ జరిగింది ? ఎందుకు ఇంత ఘోరంగా ఓటమి చెందాల్సి వచ్చింది అనే విషయంపై విశ్లేషణ చేసుకుంటున్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ రాష్ట్ర నాయకత్వాలు గట్టిగా ప్రయత్నించినా అంచనాలు ఎందుకు తప్పాయి.
ఘోర ఓటమికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనే దానిపైన ఇప్పుడు పార్టీ పెద్దల్లో చర్చ జరుగుతుంది .తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తామని ముందు నుంచి అంచనా పెట్టుకున్న బిజెపి కి కేవలం ఎనిమిది స్థానాలు మాత్రమే దక్కడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.గెలిచిన ఎనిమిది స్థానాలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా నుంచి ఉండడం, పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని ఆశించిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గోషామహల్ సీటు మాత్రమే గెలుచుకోవడం తో అసలు అంచనాలు ఎక్కడ తప్పాయి అనే విషయంపై విశ్లేషణ చేసుకుంటున్నారు.
బీసీ సీఎం నినాదం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు, సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లో ఎందుకు ప్రభావం చూపించలేకపోయాయి అనేదానికైనా విశ్లేషణ చేసుకుంటున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు బిజెపికి అనుకూలంగా ఎందుకు మారలేదు అనేదానిపైన పోస్టుమార్టం చేస్తున్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో, దానిని తమకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణ కాంగ్రెస్( Telangana congress ) సక్సెస్ అయింది .కానీ మనం ఎందుకు ఫెయిల్ అయ్యామనే దానిపైన చర్చించడంతో పాటు, రాబోయే రోజుల్లో బిజెపికి తెలంగాణలో ఎదురు లేకుండా చేసుకునేందుకు ఏమేం చేయాలనే విషయం పైన బిజెపి అగ్ర నేతలు దృష్టి సారించారు.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కొనసాగిన బండి సంజయ్( Bandi Sanjay ) ను తప్పించి కిషన్ రెడ్డిని నియమించి పొరపాటు చేశామనే విషయం పైన బిజెపి అగ్ర నాయకులు చర్చించుకుంటున్నారు.బిజెపి అధ్యక్ష బాధ్యతలు ఇంకా కొనసాగించేందుకు అంత ఆసక్తి చూపించకపోవడంతో , ఆయన స్థానంలో మళ్లీ బండి సంజయ్ ను నియమిస్తే ఎలా ఉంటుందనే దానిపైన బిజెపి అగ్ర నేతలు ఆలోచించుకుంటున్నారట.పార్లమెంట్ ఎన్నికల వరకు కిషన్ రెడ్డిని కొనసాగించి , ఆ తర్వాత పూర్తిస్థాయిలో తెలంగాణ బీజేపీని ప్రక్షాళన చేయాలనే నిర్ణయానికి బిజెపి అగ్ర నేతలు వచ్చారట.