ఇటుక బట్టీలో కాలిపోతున్న బాల్యం...!

నల్లగొండ జిల్లా: చండూరు మండలం బంగారిగడ్డ, ఇడికుడ తదితర గ్రామాలలో రోజు రోజుకు ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

నిబంధనల ప్రకారం పలు శాఖల నుండి తీసుకున్న అనుమతుల మేరకు కాకుండా ఇష్టానుసారంగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా అటు వైపు కన్నెత్తి చూసే అధికారులు లేకపోవడం గమనార్హం.

వ్యవసాయ భూముల్లో పరిశ్రమలు నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు ఉండవు.కానీ,ఇటుక బట్టీల వ్యాపారులు మాత్రం ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న రైతుల దగ్గర భూములు లీజుకు తీసుకొని యధేచ్చగా వ్యాపారం చేస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇటుక బట్టీలు నిర్వహించాలంటే ముందుగా గ్రామ పంచాయితీ అనుమతితో పాటు,భూగర్భ గనుల శాఖ,కాలుష్యం నియంత్రణ మండలి అనుమతులు తీసుకోవాలి.అలాగే ప్రజల నివాస ప్రాంతానికి కనీసం 5 కి.మీ.దూరంలో,పంట పొలాలకు కనీసం 500 మీటర్ల దూరంలో, ప్రధాన రహదారికి 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి.కానీ,ఇక్కడ ఆ నిబంధనలు మచ్చుకు కూడా ఉండవు.

ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వలస కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయిస్తూ శ్రమ దోపిడికి పాల్పడినా,చిన్నపిల్లల చేత పని చేయిస్తూ బాల కార్మిక చట్టాలను తుంగలో తొక్కినా ఎవరూ పట్టించుకోరు.ఇక్కడ పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలి.

Advertisement

కానీ,అవి భూతద్దం వేసి వెతికినా కనిపించవు.వలస కార్మికులతో పని చేయించుకుంటూ వారికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయకపోవడం వల్ల దుర్భర జీవితాలు గడుపుతున్నారు.

పని చేసిన కడుపునిండా తిండి లేక కడుపున పుట్టిన పిల్లల్ని బాల కార్మికులుగా మారుస్తున్నారు.వారి బాల్యాన్ని ఇటుక బట్టీల్లో బందీ చేస్తూ చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు.

ఇంత జరుగుతున్నా పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఇటుక బట్టీల వ్యాపారులకు అండదండగా అంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇదిలా ఉంటే రహదారి పక్కనే ఇటుక బట్టీలు ఉండడంతో వాటికి వినియోగించే బూడిద,బొగ్గు,ఊక పదార్థాలను వినియోగించడంతో పూర్తిగా వాతావరణ కాలుష్యం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

అంతేకాకుండా ఇటుక బట్టీల కాల్చడం కోసం కలప అక్రమ రవాణా యథేచ్చగా కొనసాగుతుంది.టన్నుల కొద్దీ కలపను ఇటుక బట్టీలకు తరలుతోంది.

భారత్‌లోని ఆ ప్రాంతంలో తిరుగుతూ కెమెరాకి చిక్కిన యూఎఫ్ఓ?
పట్టభద్రుల ఓటర్లలో టాప్ లో ఖమ్మం జిల్లా రిటర్నింగ్ అధికారిణి దాసరి హరిచందన

యాజమాన్యం దురుసు ప్రవర్తన అక్రమార్కులు వాల్టా చట్టానికి తూట్లు పొడిచి అక్రమ వ్యాపారం చేస్తున్నారని తెలిసి మీడియా ప్రతినిధి అక్కడికి వెళ్లి సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఇటుక బట్టీల యజమాన్యం దురుసుగా ప్రవర్తిస్తూ.మాకు అన్ని అనుమతులు ఉన్నాయి.

Advertisement

మీరేంది అడిగేదని,మీలాంటి వాళ్లు చాలామంది వచ్చి పోయిండ్రు,చాలామందిని చూసినం,వాళ్లజీవితాలను మీరేమన్నా మారుస్తారా?వాళ్లని మీ ఇంటికి తీసుకెళ్లి రోజూ భోజనం పెట్టు అని హేళన చేస్తూ ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ బెదిరింపులకు పాల్పడం కొసమెరుపు.ఇటుక బట్టీల యాజమాన్యం ఇంతలా బరితెంగించడం వెనుక అధికారుల హస్తం ఉందని భావించాల్సి వస్తుంది.

నిబంధనలకు విరుద్ధంగా వలస కార్మికుల కష్టాన్ని కొల్లగొట్టి,బాలలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నా ప్రభుత్వ అధికార యంత్రాంగం మాత్రం వీటిపై దృష్టి సారించని దాఖలాలు లేకపోవడం దానికి బలం చేకూరుతుంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటుక బట్టీల్లో తనిఖీలు నిర్వహించి,బందీ అయిన బాలకార్మికులకు విముక్తి కల్పించి,శ్రమ దోపిడికి గురవుతున్న వలస కార్మికులకు పని గంటలు తగ్గించి,కనీసం వేతనం అమలయ్యేలా,వారికి కనీస వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

Latest Nalgonda News