ఏపీలో ఉచితంగానే ప్రజలకు ఇసుక అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే కుదలైన నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు, అలాగే భారీగా పెరిగిన ఇసుక ధరలతో సామాన్యులకు ఇంటి నిర్మాణ ఖర్చు తడిసి మోపుడు అవుతుండడం తో, ఎన్నికల సమయంలోనే ఉచిత ఇసుక హామీని టిడిపి, జనసేన , బీజేపీ ( TDP, Janasena, BJP )కూటమి పార్టీలు ఇచ్చాయి.
ఆ హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది .ఈనెల 8వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నారు .దీనికి సంబంధించిన ఫైలు చంద్రబాబు ఆమోదం కోసం వెళ్ళింది. దీనిపై చంద్రబాబు సంతకం చేయగానే వెంటనే ఉచిత ఇసుక అమలు ఉత్తర్వులు వెలువడనున్నట్లు గనులు శాఖ పేర్కొంది.
ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇసుకను మనుషులతో తవ్వి తీయించి , వాహనాల్లో లోడ్ చేయించి , తిరిగి డిపోలకు తరలించినందుకు గనుల శాఖకు కొంత ఖర్చు అవుతుంది.
దీనిని నిర్వహణ వ్యయంగా పిలుస్తారు.
రీచ్ లు, డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజును ఒక్కో జిల్లాల్లో ఒక్కో విధంగా నిర్ణయించనున్నారు.
ఏపీలో b1 కేటగిరి ఇసుక రీచ్ లే ఉన్నాయి.వీటిల్లో యంత్రాలను ఉపయోగించరు.
మనుషులే ఇసుక తవ్వి వాహనాలలో లోడ్ చేస్తారు.దీనికయ్యే ఖర్చులతో పాటు, రీచ్ నుంచి డిపోకు ఇసుక తరలించేందుకు అయ్యే చార్జీలను వినియోగదారులు భరించాలి.
ఈ మేరకు జిల్లా కలెక్టర్లు , గనుల శాఖ అధికారులతో కూడిన ఇసుక కమిటీలు ఈ ధరలను నిర్ణయించనున్నారు.రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక ( 20 tons of sand )మాత్రమే సరఫరా చేయాలని నిబంధనలను చేర్చారట.
ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ , ట్రాక్టర్ , ఎడ్ల బండి వంటి వాహనాలను తీసుకొని వచ్చి ఇసుకని తీసుకువెళ్లవచ్చు. ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకునే ఏర్పాటును చేయనున్నారు.నిర్వహణ చార్జీలు, గ్రామ పంచాయతీలకు ఇచ్చే రూ 88 ఫీజును ఆన్లైన్ లోనే చెల్లించేలా నిబంధనలు తీసుకురావాలని నిర్ణయించారట. డిపో పరిధిలోని గ్రామ , వార్డు సెక్రటరీ సిబ్బంది సేవలను ఈ మేరకు వినియోగించుకుంటారు.
అలాగే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర థర్డ్ పార్టీ యాప్ ల ద్వారానూ ఫీజు చెల్లింపులు జరిపేలా జిల్లాల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలను సిద్ధం చేశారు.
ఉచిత ఇసుక విధానంలో ప్రైవేటు అమ్మకాలను నిషేధించనున్నారు.ఇసుక అవసరం ఉన్నవారు నేరుగా తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, వివరాలను జత చేసి డిపో ఇన్చార్జి వద్ద ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. గృహ నిర్మాణరంగం, ప్రభుత్వ అవసరాల కోసమే ఇసుక ఇవ్వనున్నారు.
ఉచితంగా ఇసుక తీసుకువెళ్లి ప్రైవేట్ గా స్టాక్ చేసుకుని అమ్ముకునేందుకు వీల్లేకుండా నిబంధనలను తీసుకొచ్చారు. ఉచిత ఇసుక దుర్వినియోగం కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు ఇసుక విధివిధానాలపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్ననే జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.