రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది ఎన్నో సందర్భాల్లో రుజువు అయింది. ఇదే విధంగా అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ పైన ,ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైన విమర్శలు గుప్పిస్తూ వచ్చే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ , మంత్రులు కేటీఆర్( KTR ) , హరీష్ రావు వంటి వారు ఇప్పుడు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీపై సానుభూతి చూపిస్తూ , చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పై స్పందిస్తున్నారు .
అంతేకాదు ఒక అడుగు ముందుకు వేసి మరి ఏపీ అధికార పార్టీ వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లను బిఆర్ఎస్ వైపుకు మళ్లించేందుకు తాజాగా మంత్రి కేటీఆర్ టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు ( Chandrababu arrest )వ్యవహారంపై స్పందించారు.
చంద్రబాబు అరెస్టు మానవీయ కోణంలో సరికాదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.వ్యక్తిగతంగా చూసిన 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని ఈ విషయం తెలిస్తే ఎవరైనా అయ్యో పాపం అని అంటారని కేటీఆర్ చెప్పారు.చంద్రబాబు భద్రతపై లోకేష్ ఆందోళన వ్యక్తం చేయడం సరైనదేనని కేటీఆర్ అన్నారు .గతంలో తాము తెలుగుదేశం పార్టీని విమర్శించిన మాట వాస్తవమేనని , 2018 లో కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకుందని,ఆ కోపం తోనే తాము టిడిపి పై విమర్శలు చేసామని కేటీఆర్ ( KTR )అన్నారు.కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, 2023 ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడం లేదు కాబట్టి, ఆ పార్టీపై విమర్శలు చేసేందుకు అవకాశం లేదని కేటీఆర్ అన్నారు.
దీంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు( Harish Rao ) తదితరులు టిడిపి సానుభూతిపరుల ఓట్లను బీఆర్ఎస్( BRS ) వైపుకు మళ్లించేందుకు ఇప్పుడు టిడిపి ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారని, మొన్నటి వరకు ఏపీ అధికార పార్టీ వైసీపీతో అంట కాగిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆకస్మాత్తుగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం పైన , జగన్ పరిపాలన పైన విమర్శలు చేస్తూ తెలంగాణను టిడిపి ఓటు బ్యాంకును తమ పార్టీ వైపుకు డైవర్ట్ చేసుకోవాలనే ప్లాన్ తో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారనే అభిప్రాయాలు జనాల్లోనూ వ్యక్తం అవుతున్నాయి .