ఇటీవల కాలంలో కష్టపడి సంపాదించే వారి కంటే కంప్యూటర్ టెక్నాలజీ లో నైపుణ్యం పొంది అమాయకులను మోసం చేసి డబ్బు సంపాదించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.కొందరు కేటుగాళ్లు కొత్త తరహా మోసాలతో అమాయకులను టార్గెట్ చేస్తున్నారు.
అలాంటి కోవకు చెందిన ఒక భారీ మోసం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకెళితే.సిద్దిపేటకు( Siddipeta ) చెందిన గడగోని చక్రధర్ అనే రాజకీయ నాయకుడు దాదాపుగా 22 వేల మందిని మోసం చేసి రూ.10 కోట్ల వరకు కాజేసిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చక్రధర్( Chakradhar ) ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పలు రాష్ట్రాలకు చెందిన టెలికాలర్స్( Tele Callers ) ద్వారా డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయంటూ.అమాయకులను టార్గెట్ చేస్తూ డేటా ఎంట్రీ ప్రాజెక్ట్ ఇస్తామంటూ నమ్మించాడు.పైగా జీతం నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది అంటూ నమ్మించాడు.తన వలలో చిక్కిన వారికి ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసిన ఇమేజ్లను పంపించి డాక్యుమెంట్ గా కన్వర్ట్ చేయాలంటూ పరీక్ష పెట్టేవాడు.
ఎవరైతే పని పూర్తి చేస్తారో వారు అడ్వాన్స్ గా 10% చెల్లిస్తే క్వాలిటీ చెక్ చేసి తిరిగి మీ డబ్బులు చెల్లిస్తామని చెప్పేవాడు.బాధితులు 10 శాతం డబ్బులు చెల్లించిన తర్వాత ఏవో పొరపాట్లు ఉన్నాయని వాటిని సెట్ చేయడం కోసం మరో 10 శాతం డబ్బులు చెల్లించాలంటూ మొత్తంగా 20% డబ్బులు వసూలు చేసుకునేవాడు.
తరువాత 30 నుంచి 45 రోజులు పూర్తయిన వెంటనే ఆ బ్యాచ్ ను క్లోజ్ చేసి, ఆ బ్యాచ్ లో వాడిన సిమ్ కార్డులు, డేటా ఎంట్రీ ఇమేజ్లను మొత్తం ధ్వంసం చేసేవాడు.కాస్త విరామం తీసుకుని మరో కొత్త బ్యాచ్ ఏర్పాటుచేసి ఇలాగే మోసం చేసేవాడు.కొందరు బాధితులు రూ.5 వేలే కదా పోయింది అని వదిలేసేవారు.కానీ ఇద్దరు బాధితులు తమపై జరిగిన మోసం గురించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చక్రధర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
చక్రధర్ ఇప్పటివరకు దాదాపుగా 11 బ్యాచ్ లను ఏర్పాటు చేసి సుమారుగా 22,000 మంది బాధితుల నుండి రూ 10 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.
ఈ మొత్తం డబ్బుతో బాచుపల్లి ప్రాంతంలో ఖరీదైన ప్లాట్లు కొనుగోలు చేశాడు.చివరికి జైలు పాలయ్యాడు.