ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది .ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాన్ని వేడెక్కించే పనిలో అన్ని పార్టీల నేతలు నిమగ్నమయ్యారు .
ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఈ మధ్యకాలంలో తీవ్రమయ్యాయి.మళ్లీ ఏపీలో వైసిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా , జనాల్లో బలం పెంచుకునే కార్యక్రమానికి అధికార పార్టీ వైసిపి అనేక వ్యూహాలు అమలు చేస్తుండగా , వాటిని తిప్పుకొట్టేందుకు, తాము పైచేయి సాధించేందుకు టిడిపి, జనసేన, బిజెపిలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
ఇప్పటికే అధికార పార్టీ వైసిపి గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో జనాల్లోకి వెళ్తోంది.ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి జనాలకు వివరించే ప్రయత్నం చేస్తుండగా, టిడిపి సైతం ఈ తరహాలోనే పార్టీ తరఫున సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది.
అలాగే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్నారు.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార వారాహి ద్వారా , ఏపీ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను హైలెట్ చేసే విధంగా స్టిక్కర్ ప్రచారానికి తెరతీసింది.“ మా నమ్మకం నువ్వే జగన్ ” అనే పేరుతో స్టిక్కర్లను తయారు చేయించింది .ఇప్పుడు ఏపీవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఆ స్టిక్కర్లను అంటించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా జగన్ ఫోటోతో మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లను అతికించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది .
అయితే దీనికి గట్టి కౌంటర్ ఇచ్చే విధంగా జనసేన సిద్ధమైంది.మాకు నమ్మకం లేదు దొర , నిన్ను నమ్మలేం జగన్ పేరుతో స్టిక్కర్ పోస్టర్లను వైరల్ చేస్తోంది.ఇందులో ఓ సామాన్యుడి ఫోటోలు పెట్టి ఆయన జగన్ నమ్మలే ఉంటూ చేతులెత్తి నమస్కరిస్తున్న ఫోటోను జనసేన రెడీ చేసుకుంది.వైసిపి స్టిక్కర్ల కార్యక్రమం మొదలు పెట్టగానే జనసేన కూడా అదే తరహాలో ఈ స్టిక్కర్లను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.