ఏపీలో టీడీపీ ని మరింత బలోపేతం చేయాల్సి ఉంది.అధికార పార్టీ వైసీపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలంటే, క్షేత్రస్థాయిలో మరింత బలం పెంచుకుని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను హైలెట్ చేస్తూ , ఎన్నికల సమయం వరకు తీరిక లేకుండా వివిధ కార్యక్రమాలతో జనాల్లో దూసుకు వెళ్ళగలిగితేనే అది సాధ్యమవుతుంది.
ఈ విషయం టిడిపి అధినేత చంద్రబాబుకు బాగా తెలుసు.అందుకే ఆయన తను వయసును కూడా లెక్కచేయకుండా అలుపెరగకుండా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు.
పూర్తిగా ఏపీ రాజకీయాలపై బాబు దృష్టి పెట్టినట్లుగా మొన్నటి వరకు వ్యవహరించినా, ఇప్పుడు బాబు తన రూట్ మార్చుకున్నారు.ఏపీతో పాటు తెలంగాణలో బలం పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ముఖ్యంగా టిడిపికి గట్టి పట్టు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, సెటిలర్స్ అధికంగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల పైన దృష్టి సారించారు.
అయితే బాబు తెలంగాణలో పార్టీని యాక్టివ్ చేయడం వెనుక బిజెపి పెద్దల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది క్లారిటీ లేకపోయినా, తెలంగాణలో టిడిపిని బలోపేతం చేయడం ద్వారా టిఆర్ఎస్ కు పడే ఓట్లలో చీలిక అయితే బాబు తీసుకొస్తారనేది వాస్తవం.2019 ఎన్నికల సమయంలో ఏపీలో వైసిపి ప్రభుత్వం ఏర్పడే విధంగా కేసీఆర్ జగన్ కు ఎంతగానో సహకరించారు.ఆర్థికంగాను, రాజకీయంగాను అండదండలు అందించారు. టిడిపి ఓటమి చెందడానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కేసీఆర్ కారణం అయ్యారు.ఇప్పుడు ఆ పగను బాబు తీర్చుకునేందుకు సిద్ధమైనట్టుగానే కనిపిస్తున్నారు.
ఏపీ కంటే తెలంగాణలో ముందుగా ఎన్నికలు జరగబోతూ ఉండడం తో ఇక్కడ బిజెపికి కలిసి వచ్చేలా బాబు చక్రం తిప్పగలిగితే , ఏపీలో జనసేన, బీజేపీ, టిడిపి కలిసి పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుందని బాబు అంచనా వేస్తున్నారు.అలా కాని పక్షంలో జగన్ కు బిజెపి మద్దతు ఇవ్వకుండా అయినా చేయవచ్చనే నమ్మకంతో బాబు ఉన్నారు.తెలంగాణలో టిడిపిని యాక్టివ్ చేయడం ద్వారా , అటు కేసీఆర్ పై తనకున్న రాజకీయ కక్షను తీర్చుకోవడంతోపాటు, ఏపీ రాజకీయాల్లోనూ సహకారం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొందవచ్చనే అంచనాలో బాబు ఉన్నారట.