సర్వేల అంచనాలను నిజం చేస్తూ బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికైన సంగతి తెలిసిందే.దీంతో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఓటమి పాలయ్యారు.
మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన మూడో మహిళగా లిజ్ ట్రస్ రికార్డుల్లోకెక్కారు.దీంతో పలు దేశాల అధినేతలు, ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.
అయితే ఇప్పుడు లిజ్ ట్రస్‌కు ప్రధాని పదవి కత్తిమీద సాము వంటిదే అంటున్నారు విశ్లేషకులు.ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు, ఆర్ధికవృద్ధి మందగమనంలో వుండటం వంటి సమస్యలను ఆమె అధిగమించాల్సి వుంది.
ఇకపోతే వివిధ దేశాలతో లిజ్ ట్రస్ విదేశాంగ విధానం ఎలా వుండనుంది అని అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.ప్రధానంగా ప్రబల ఆర్ధిక శక్తిగా ఎదుగుతోన్న భారత్‌తో ఆమె ఎలా వ్యవహరించనున్నారు అనే దానిపై ఇరు దేశాల్లో ఉత్కంఠ నెలకొంది.
నిజానికి భారత్- బ్రిటన్ సంబంధాలపై లిజ్ ట్రస్‌కు తొలి నుంచి మంచి పట్టుంది.ఇరుదేశాల వ్యూహాత్మక, ఆర్ధిక సంబంధాలకు సంబంధించి ఆమె తరచుగా మాట్లాడేవారు.అలాగే గతేడాది కుదిరిన ‘భారత్ బ్రిటన్ మెరుగైన వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం’’పై లిజ్ ట్రస్ సంతకం చేశారు.బ్రిటన్ కేబినెట్ మంత్రిగా పలుమార్లు భారత్‌లో పర్యటించారు కూడా.
అటు బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.మీ నాయకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాలని ప్రధాని ఆకాంక్షించారు.
ఇకపోతే.లిజ్ ట్రస్ యూకే కొత్త ప్రధాని కావడంపై భారత పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్ధిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కోసం బ్రిటన్‌తో చర్చలను త్వరగా ముగించాలని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలను ఆగస్ట్ 31 నాటికి ముగించాలని భారత అధికారులు భావించారు.
అయితే బ్రిటన్‌లో రాజకీయ అనిశ్చితి, కొత్త ప్రధాని రాక నేపథ్యంలో చర్చలు కొంత ఆలస్యమయ్యే అవకాశం వుంది.
ఈ ఏడాది జనవరిలో .ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) కోసం రెండు దేశాలు అధికారికంగా చర్చలు ప్రారంభించాయి.బోరిస్ జాన్సన్ ప్రధానిగా వున్నప్పుడు.
ట్రస్ అంతర్జాతీయ వాణిజ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు దీనిని ప్రారంభించారు.ఇరుదేశాల మధ్య పెట్టుబడులు, సేవల వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి నిబంధనలను సడలించడంతో పాటు వస్తువులపై కస్టమ్స్ సుంకాలను తొలగించడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం.
అయితే దీపావళి నాటికి ఎఫ్‌టీఏ ఓ కొలిక్కి రావొచ్చని పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.