యాదాద్రి జిల్లా:తెలంగాణలో రైతుని రాజుగా చేస్తానని చేప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రైతులను బిచ్చగాలుగా మార్చారని కాంగ్రెస్ కిసాన్ జిల్లా అధ్యక్షుడు మర్రి నర్సింహారెడ్డి మండిపడ్డారు.సోమవారం ఆయన సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ రెవిన్యూ పరిధిలో తూంబయి తండా,కడిలాబాయి తండా,ఐదొనల్ తండా,పల్లగట్టు తండాలలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు భూమిలేని నిరుపేదలకు లక్షల ఎకరాలలో భూములు పంపిణి చేసి బడుగుల బ్రతుకుల్లో వెలుగులు నింపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు.భూ రికార్డుల శుద్ధి పేరుతో తెలంగాణ ప్రభుత్వం చెపట్టిన ధరణితో రైతుల భూ రికార్డులన్ని తలకిందులై పోయాయని ఎద్దేవా చేశారు.
గత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లక్షల ఎకరాల భూములను పంచి రైతును రాజుని చేసిందని,అదే రైతులను నేడు కేసీఆర్ బిచ్చగాలుగా మార్చారాని ఆవేదన వ్యక్తం చేశారు.దళితులకు 3ఎకరాల భూమిని పంచుతామని ఎన్నికల హామీ చేసి మాట మార్చారని, గత కాంగ్రెస్ హయాంలో భూ పట్టాలు పొందిన దళిత,వెనుకబడిన వర్గాల పేదలకు చెందిన అసైన్డ్, సీలింగ్,ఆర్ ఓ ఆర్ భూములను పారిశ్రామిక వర్గాలకు అప్పచెప్పే కుట్రను చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వం వారికీ డిజిటల్ విధానంలో భూ పట్టాలు ఇవ్వకపోగా అడిగితే పోడు భూముల సాగుదారులను జైలుపాలు చేస్తుందన్నారు.ఫారెస్ట్,రెవిన్యూ శాఖల మధ్య పొంతనలేని రికార్డులతో అమాయక గిరిజన రైతులను ఆగం చేయవద్దన్నారు.
ధరణిలో లోపాల వల్ల రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని,తప్పుల తడకమయమైన ధరణి భూ రికార్డులతో గ్రామలలో నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొందని అన్నారు.రాచకొండ ప్రాంతంలో ముఖ్యంగా సర్వే నంబర్లు 85,106,192,273 లలో 13000 ఎకరాల భూమి ఉండగా ఇందులో14 రెవిన్యూ గ్రామాల పేద రైతులు అనుభవదారులుగా ఉన్నారని, సాగుకు యోగ్యంకాని భూములను శ్రమపడి రెక్కల కష్టంతో సాగులోకి తెచ్చి సంతోష పడుతున్న వేళ ధరణితో వచ్చిన కష్టాలు రైతులకు తీరనివని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పిమ్మట ధరణిని రద్దు చేస్తామని వరంగల్ డిక్లరేషన్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంతరెడ్డి ప్రకటించారాని గుర్తు చేశారు.తరతరాలుగా వారసత్వంగా అనుభవిస్తున్న భూములకు కేసీఆర్ భూ పట్టాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని,బంగారు తెలంగాణ పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఈనెల 6న హైద్రాబాద్ లోని ఇందిరపార్క్ లో జరిగే కిసాన్ దీక్షకు అధిక సంఖ్యలో ధరణి బాధిత రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అక్బర్ అలీ,రాసమళ్ళ యాదయ్య,కిసాన్ కాంగ్రెస్ నాయకులు ఏపూరి సతీష్,ఐఎన్టీయూసీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు ఎస్కే.
బడేసాబ్,జిల్లా నాయకులు నోముల మాధవరెడ్డి,జక్కిడి బాల్ రెడ్డి, ఘనం అంజయ్య,ఎండి.నహీం షరీఫ్,డివిజన్ నాయకులు కరెంటోతూ ప్రజ్ఞ నాయక్,కిసాన్ మండల కమిటీ అధ్యక్షులు జగ్రం నాయక్,మండల బీసీ సెల్ అధ్యక్షులు రతిపల్లి యాదయ్య,ఐఎన్టీయూసీ మండల అధ్యక్షులు రాచకొండ లింగస్వామి,గిరిజన నాయకులు లోక్య నాయక్,జగన్ నాయక్,గోవర్ధన్ నాయక్, యూత్ నాయకులు ఉప్పల నాగరాజు,బొంగు ముకేశ్,గోల్లూరి శివ,గ్రామశాఖ కృష్ణా,ముసఖాన్, రాచకొండ మైసయ్య తదితరులు పాల్గొన్నారు.