వైసీపీకి కడప జిల్లా కంచుకోట వంటిది.ఎన్నికలు జరిగితే ఏపీలోని ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చినా కడప జిల్లాలో మాత్రం మెజారిటీ సీట్లను వైసీపీ సొంతం చేసుకుంటుంది.2019 ఎన్నికల్లోనూ ఇదే సీన్ కడప జిల్లాలో కనిపించింది.అయితే తాజాగా కడప జిల్లాలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా జిల్లాల విభజన తర్వాత వివాదాలు చెలరేగడం, ఎమ్మెల్యేలకు ప్రజలకు మధ్య గ్యాప్ పెరగడం వంటి కారణాలతో వైసీపీకి కష్టాలు తప్పడం లేదని అంటున్నారు.ముఖ్యంగా కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్తున్నారు.
కొన్ని నెలల కిందట వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజనను చేపట్టింది.ఆ సమయంలో కడప జిల్లాలోని రాయచోటిని జిల్లా కేంద్రంగా మారుస్తూ అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు.
అయితే రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ వచ్చింది.దీనిని జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కుటుంబం ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకుండా పోయింది.దీంతో ఇక్కడి ప్రజలు వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాజంపేట జిల్లా విషయంలో తన మాటను వైసీపీ సర్కారు పట్టించుకోకపోవడం మేడా మల్లికార్జునరెడ్డి తిరిగి టీడీపీలో చేరాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.గతంలో ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు.
అయితే జిల్లాల విభజన అంశంతో ఆయన అసంతృప్తిగా ఉండటంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది.మరోవైపు కమలాపురంలో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్లు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కమలాపురంలో రవీంద్రనాథ్‌రెడ్డిపై వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.వీరశివారెడ్డి ప్రస్తుతం వైసీపీలో ఉన్నా ఆయన కూడా త్వరలో టీడీపీలో చేరతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.అటు ప్రొద్దుటూరులోనూ వైసీపీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీలోనే గ్రూపులు ఏర్పడ్డాయి.తాజా పరిణామాలతో కడప జిల్లాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 4 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.