ఏపీ రాష్ట్రంలో గల మంగళగిరి అనే ఊరు పేరు వింటే చాలు అక్కడ వెలిసిన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గుర్తుకు వస్తుంది.గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై గుంటూరుకు 20 కి.
మీ దూరంలో ఈ పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది.అలాగే మంగళగిరి అనగానే పానకాల స్వామి గుర్తుకు వస్తాడు.
ఇక్కడ నిత్యం లక్ష్మి నరసింహ స్వామికి పానకం సమర్పిస్తూ ఉండడం వలన ఈ స్వామిని పానకాల స్వామి అని కూడా పిలుస్తారు.ఎంతో చారిత్రాత్మక పేరు గల ఈ ఆలయం సమీపంలో తిరిగే ఒక వ్యక్తి కిరాణా షాపు వారిని ఎమ్మెల్యే పీఏ అని చెప్పి వేల రూపాయల సరుకులు తీసుకెళ్లి మోసం చేసాడు.
సుమారు 20 వేల రూపాయల మేర సరుకులు తీసుకుని షాపు యజమానులకు టోకరా వేసాడు.
వివరాల్లోకి వెళితే.మంగళిగిరి దేవస్థానం సమీపంలో గల ఒక కిరాణా దుకాణం వద్దకు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మురళి అనే వ్యక్తి వచ్చి నేను ఎమ్మెల్యే పీఏ అని చెప్పి షాపు యజమానులను నమ్మించాడు.నేను చెప్పిన సరుకుల లిస్ట్ ప్రకారం సరుకులు కట్టి మీ షాపులో పనిచేసే కుర్రాడితో తాను చెప్పిన అడ్రస్ కి పంపమని చెప్పి వెళ్లిపోయాడు.
అతను చెప్పిన మాటలు నమ్మిన షాపు యాజమాని అతను చెప్పిన సరుకుల లిస్ట్ అంతా రెడీ చేసాడు.కాసేపటికి మురళి అనే వ్యక్తి షాప్ యజమానికి ఫోన్ చేసి నేను టీడీపీ ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నానని మీ కుర్రాడిని ఆఫీస్ గేట్ దగ్గరకు పంపిస్తే డబ్బులు ఇస్తానని చెప్పి, ఆ సరుకులను మాత్రం మంగళగిరి బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న వీజే కాలేజీ రోడ్డులో గల కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తికి ఇచ్చి వెళ్లమని చెప్పాడు.
మురళి అనే వ్యక్తి ఫోన్లో చెప్పిన విధంగానే సరుకుల సంచిని కుర్రాడు కొబ్బరి బొండాల వ్యాపారికి అందజేసి అటునుంచి అటు టీడీపీ ఆఫీసుకు వెళ్లాడు.అయితే ఎంతసేపు చూసిన మురళి అనే వ్యక్తి రాలేదు.ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని గుర్తించారు.అనుమానం వచ్చిన ఆ షాపు కుర్రాడు హుటాహుటిన తాను సరుకులు ఇచ్చిన కొబ్బరి బొండాల వ్యాపారి వద్దకు వెళ్లి అడగడం జరిగింది.
అయితే ఆ వ్యాపారి మాత్రం నువ్వు సరుకులు ఇచ్చి వెళ్లిన వెంటనే ఎవరో వ్యక్తి వచ్చి వాటిని తీసుకెళ్లాడని చెప్పాడు.తనకయితే ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని చెప్పడంతో ఆ కుర్రాడు షాక్ అయ్యి షాపు యజమానులకు జరిగిన విషయం చెప్పాడు.
తాము మోస పోయామని గ్రహించిన వ్యాపారస్థులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.