వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నా, టీకాలు అందుబాటులోకి వస్తున్నా ప్రపంచంపై కోవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదు.నిత్యం ఏదో ఓ మూలన ఆ మహమ్మారి విజృంభిస్తూనే వుంది.
వీటికి కొత్తగా మ్యూటేషన్ చెందిన వైరస్ అదనం.వివిధ దేశాల్లో కొత్తగా వెలుగులోకి వస్తున్న మార్పు చెందిన కరోనా.
ప్రభుత్వాలకు నిద్ర లేకుండా చేస్తోంది.ఇప్పటికే యూకే సహా పలు దేశాల్లో కఠిన లాక్‌డౌన్ అమల్లో వున్న సంగతి తెలిసిందే.
ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.వివిధ దేశాల నుంచి మనదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం బుధవారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఈ కొత్త గైడ్‌లైన్స్ ఫిబ్రవరి 22 అర్ధరాత్రి 11.59 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వెలువడేవరకు అమల్లో ఉంటాయి.ప్రధానంగా బ్రిటన్, ఐరోపా, మధ్యప్రాచ్యం నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్రం వెలువరించింది.అదే సమయంలో ఈ నెల 28 వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధించింది.కొత్త నిబంధనల ప్రకారం పైన వివరించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణం మొదలవడానికి ముందే ఎయిర్ సువిధ వెబ్‌సైట్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.కొవిడ్-19 ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ ఫలితం నివేదికను అప్‌లోడ్ చేయాలి.
కాగా, మనదేశంలో దక్షిణాఫ్రికా కొత్త రకం కరోనాకు సంబంధించి నాలుగు కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ నాలుగు కేసులు గత నెల జనవరిలోనే బయటకొచ్చినట్లు వెల్లడించింది.
వీరిలో ఒకరు అంగోలా నుంచి, మరోకరు టాంజానియా, మిగతా ఇద్దరు దక్షిణాఫ్రికా నుంచి వచ్చారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో జ్రెజిల్ నుంచి వచ్చిన ఒకరు కొత్త స్ట్రెయిన్ బారినపడ్డారని తెలిపింది.
కొత్త రకం వైరస్ బారిన పడిన వారి నమూనాలను సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది.మరోవైపు భారత్‌లో ఇప్పటివరకు 187 మంది యూకే రకం స్ట్రెయిన్ బారిన పడ్డారని.
అయితే ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని ఐసీఎంఆర్ ప్రకటించింది.