భారతదేశంలో మూడు దశాబ్ధాల క్రితం నెత్తుటేర్లు సారించిన పీడ కల ఖలిస్తాన్ ఉద్యమం.భారతీయుల సమైక్యతను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ప్రయోగించిన పదునైన ఆయుధం ఖలిస్థాన్.
సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ ఆరంభమైన ఈ ఉద్యమం అప్పట్లో సృష్టించిన మారణకాండ అంతా ఇంతా కాదు.పంజాబ్ యువతను విపరీతంగా ఈ ఉద్యమానికి ఆకర్షించిన పాకిస్తాన్.
ఇందుకు కావాల్సిన ఆయుధాలు, నిధులను అందించేది.బింద్రేన్ వాలే నేతృత్వంలోని ఖలిస్థాన్ ఉగ్రవాదుల ఆగడాలు మితిమీరడంతో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ సైనిక చర్య ద్వారా స్వర్ణ దేవాలయంలో తలదాచుకున్న ఉగ్రవాదులను ఏరిపారేశారు.
దీంతో ఖలిస్థాన్ ఉద్యమం కథ ముగిసింది.
అయితే ఈ ఉద్యమాన్ని మళ్లీ నిద్రలేపాలని పాక్ గూడఛార సంస్థ ఐఎస్ఐ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది.
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖలిస్థాన్ అనుకూలవాదులను ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా భారత నిఘా వర్గాలు గుర్తిస్తున్నాయి.ఈ క్రమంలో పంజాబ్ వాసులు ఎక్కువగా స్ధిరపడిన కెనడా నుంచి ఖలిస్థాన్ వేర్పాటువాదులకు నిధులు సమకూరుతున్నట్లుగా తెలుస్తోంది.
కెనడియన్ రాష్ట్రం బ్రిటిష్ కొలంబియా నుంచి మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ధాలివాల్, గ్రెవాల్ వంటి క్రైమ్ సిండికేట్లకు ఎస్ఎఫ్‌జే నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ అతని అనుచరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల రూపొందించిన నివేదికలో తేలింది.
ధాలివాల్, గ్రెవాల్ ముఠాలు వాంకోవర్ నుంచి తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి.
మాదక ద్రవ్యాల అక్రమ అక్రమ రవాణా, కాంట్రాక్ట్ హత్యలు, ఆయుధాల అమ్మకాలు వంటి మార్గాల ద్వారా ఈ రెండు ముఠాలు డబ్బు సంపాదిస్తున్నాయి.ఈ నిధులను ఎస్ఎఫ్‌జే నేతలకు, ఖలిస్థాన్ ఉద్యమంతో సంబంధం వున్న వారికి అందజేస్తున్నాయి.
ఈ నిధుల సాయంతో ఉగ్రవాద సిక్కు నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ అనేక ఖలిస్థానీ వర్గాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి కుట్ర పన్నినట్లుగా నిఘా వర్గాల దర్యాప్తులో తేలింది.కాగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ అనుకూల ఎస్ఎఫ్‌జే గ్రూపు భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న అభియోగంపై 2019 జూలైలో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్ధలతో సంబంధాలున్న ఎస్ఎఫ్‌జే.ఖలిస్తాన్‌కు మద్ధతుగా సిక్కు సమాజం నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రయత్నిస్తోందని తేలింది.
కెనడియన్ సిండికేట్ల నుంచి నిధులు స్వీకరిస్తున్న ఎస్ఎఫ్‌జే… పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న తన కార్యకర్తలకు హవాలా మార్గంలో డబ్బును బదిలీ చేస్తోందని జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) విచారణలో తేటతెల్లమైంది.మరోవైపు కెనడాలో సిక్కుల జనాభా ఎక్కువ.ఇక్కడ ఖలిస్థాన్ తిరుగుబాటుదారుల బృందాలు చురుకుగా ఉన్నాయని అనేక అంతర్జాతీయ నిఘా ఏజెన్సీలు భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాయి.ఈ పరిస్ధితుల నేపథ్యంలో క్రైమ్ సిండికేట్ల నిధుల సాయంపై భారత్ దృష్టి సారించాల్సిన అవసరం వుందని నిపుణులు సూచిస్తున్నారు.