ఎన్నికల సమయంలో పోటీలు పడి ప్రజలపై వరాలు కురిపిస్తారు.అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోతారు.
ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్‌రెడ్డి ఇలాగే వ్యవహరిస్తున్నారు.సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఇస్తున్న సామాజిక పెన్షన్లకు వయసును క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు.
జగన్ అయితే ఎన్నికల హామీల్లో ఏకంగా 45 ఏళ్లు దాటిన వాళ్లందరికీ పెన్షన్లు ఇస్తానని హామీలు గుప్పించారు.
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే.45 ఏళ్లు కాదు కదా.ఇప్పటికే పెన్షన్లు అందుకుంటున్న వృద్ధులు కూడా లబోదిబోమంటున్నారు.జగన్ వచ్చిన తర్వాత రూ.250 పెంచి ప్రస్తుతం రూ.2250 పెన్షన్ ఇస్తున్నారు.దీనికితోడు కొత్త అర్హతల ప్రకారం మరో పది లక్షల మంది వరకూ ఈ పెన్షన్ల పరిధిలోకి రానున్నారు.
అయితే ఆ కొత్త వాళ్లను చేర్చడానికి ఉన్న వాళ్లలో కోత విధించే పని మొదలుపెట్టారు.నెలవారీ ఆదాయ పరిమితిని పెంచారు.పట్టణాల్లో 750 చదరపు అడుగుల స్థలం కంటే ఎక్కువ ఉంటే పెన్షన్ రాదని చెబుతున్నారు.ఆదాయ పరిమితి ఇంతకుముందు గ్రామాల్లో నెలకు రూ.5 వేలు, పట్టణాల్లో నెలకు రూ.6 వేలుగా ఉండేది.కానీ ఇప్పుడు వీటికి రూ.10, రూ.12 వేలకు పెంచారు.
ఇక ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వాళ్లలో పదెకరాలపైన భూమి ఉన్న వాళ్లు, కారు ఉన్న వాళ్లు, పన్నులు కడుతున్న వాళ్లు, కరెంటు బిల్లు ఎక్కువగా చెల్లిస్తున్న వాళ్ల వివరాలు సేకరించారు.వీటిని గ్రామ సచివాలయాలకు అందజేయడంతో స్థానికంగా ఉండే వలంటీర్లు ఇంటింటికీ తిరిగి పెన్షన్లు తీసుకుంటున్న వాళ్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
దీంతో రూ.250 పెంచడం సంగతేంటోగానీ ఇప్పుడు ఉన్న పెన్షన్ కూడా పోతుందన్న ఆందోళనలో వృద్ధులు ఉన్నారు.ముఖ్యంగా పట్టణ పేదలు, ఔట్‌సోర్సింగ్, అంగన్వాడీ ఉద్యోగాలు చేసుకునే వాళ్లు భయపడుతున్నారు.
మొత్తంగా ప్రస్తుతం రాష్ట్రంలో 54 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటుండగా.అందులో కనీసం 5 లక్షల వరకూ కోత విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.