ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం పెద్దగా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.
సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం మాత్రమే పడుతుంది.టైం స్లాట్ దర్శనానికి నాలుగు,మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.
ఇంకా చెప్పాలంటే మంగళవారం రోజు స్వామి వారిని దాదాపు 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.వారిలో 24,000 మంది స్వామి వారికి తలనీలాలను సమర్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా దాదాపు నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు దేవాలయ అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్నారు.వేరు వేరు కాంపిటీటివ్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్స్ వెలుపడ్డాయి.ఈ షెడ్యూల్స్ అన్ని ముగిసిన తర్వాత తిరుమల కు వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
వేసవి సెలవులలో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని, దానికి తగినట్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.శ్రీనివాస సేతు నిర్మాణ పనులలో ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి.

మిగిలిన పనులు కూడా మే 15వ తేదీ వరకు పూర్తి చేయాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ధర్మారెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.ఇటువల ఆయన నిర్మాణ పనులను సమీక్షించారు.వేసవి సెలవులలో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ ఆరంభమయ్యే వరకు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ ఫ్లై ఓవర్ మొత్తం నిర్మాణ వ్యయం 680 కోట్ల రూపాయలతో జరుగుతోంది.
ఈ ఫ్లై ఓవర్ పనులు పూర్తయితే తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.