ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.
ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు.
కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.గల్ఫ్ గోసలు అంతా ఇంతా అని చెప్పలేము.
గల్ఫ్ కష్టాలు పగవాడికి కూడా రావద్దని అక్కడి నుంచి తిరిగి వచ్చిన బాధితులు చెబుతుంటారు.కార్మికులను మభ్యపెట్టి టూరిస్ట్ వీసా పేరిట వారిని ట్రావెల్ ఏజెంట్లు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.
గడువు ముగిసిన తరవాతా వీరు అక్కడే ఉండిపోతున్నారు.అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్‌పోర్టులు లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.
భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని అక్కడి సంస్థలు, యజమానులు, ట్రావెల్ ఏజెంట్లు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.
తాజాగా జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ ఆంధ్రప్రదేశ్ మహిళను ఏజెంట్, అతని మిత్రుడు కలిసి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు.
అంతేకాదు.నాలుగు రోజులుగా అన్నం పెట్టకుండా చిత్రహింసలు పెడుతన్నారు.
ఈ దురాగతాన్ని బాధిత మహిళ సోమవారం రాత్రి తిరుపతిలోని తన భర్తకు వీడియో తీసి పంపారు.తనను ఈ నరకం నుంచి రక్షించాలని ఆమె వాపోయారు.
వివరాల్లోకి వెళితే.శ్రీ బాలాజీ జిల్లా ఎర్రావారిపాలెం మండలం బోడేవాండ్ల పల్లె పంచాయతీకి చెందిన ఓ వివాహిత (26) ఈ నెల 24న ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లారు.
చెంగల్ రాజు అనే ఏజెంట్ ఆమెను అక్కడికి పంపుతానని , అన్ని ఏర్పాట్లు చేస్తానని నమ్మించాడు.అన్నట్లుగానే కువైట్‌లో ఓ ఇంట్లో పనికి కుదార్చాడు.అయితే అక్కడ పరిస్ధితులు బాగోకపోవడంతో తనను మరో ఇంట్లో పనిలో పెట్టాలని వివాహిత కోరింది.దీనిని అలుసుగా తీసుకుని ఏజెంట్ చెంగల్ రాజు, అతని మిత్రుడు బాలాజీలు… ఆమెను అక్కడ ఓ ఇంట్లో బంధించారు.
తమ కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు.గత నాలుగురోజులుగా ఆహారం పెట్టకుండా కేవలం నీళ్లు మాత్రమే ఇస్తున్నారని బాధితురాలు తన భర్తకు పంపిన వీడియో కాల్లో వాపోయింది.
దీనిపై వివాహిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.