మనదేశంలో దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఎంతో మంది భక్తులు దేవాలయాలకు వెళ్లి ఆ దేవుని దర్శించుకుని రావడం ఒక ఆచారంగా భావిస్తారు.
అయితే దేవాలయాలను సందర్శించినప్పుడు సాంప్రదాయమైన దుస్తులను ధరించి వెళ్లాలని మన పూర్వీకులు చెబుతుంటారు.అలాగే దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవాలయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని చెబుతుంటారు.
ఆ విధంగా చేయకూడని పనులు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా గుడికి వెళ్లే ప్రతి భక్తుడు గుడిలో ఉన్నంత సేపు తన మనసులో ఆ దేవుని ప్రార్థిస్తూ ఉండాలి.అంతే కాకుండా వేరే ఆలోచనలను మన మెదడులోకి రానీయకూడదు.
దేవాలయాలలో ఏదైనా పూజలు వ్రతాలలో పాల్గొన్నప్పుడు నిద్రపోవడం చేయకూడదు, అలాగే దేవుని సన్నిధిలో కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు. ఆలయానికి వెళ్ళిన తర్వాత తోటి భక్తులతో గొడవలు పడకూడదు.
అంతేగాకుండా ఆలయ ప్రాంగణంలో గర్వంతో, అధికార అహంకారంతో అసలు మెలగకూడదు.

దేవాలయానికి వెళ్ళినప్పుడు మొదటిగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత మాత్రమే ఆలయం లోనికి ప్రవేశించాలి.ఆలయం లోపలికి ప్రవేశించే టప్పుడు తలపాగాను తీసి స్వామి వారిని దర్శించుకోవాలి.అలాగే ఒంటిచేత్తో స్వామివారిని నమస్కరించకూడదు.
అలాగే చేతులలో ఎటువంటి ఆయుధాలను పట్టుకొని ఆలయ సన్నిధిలో అడుగు పెట్టకూడదు.ఆలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొనేవారు ఒట్టి చేతులతో వెళ్లకుండా దేవుడికి కనీసం పువ్వులు అయినా వెంట తీసుకెళ్లాలి.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సుమంగళిగా ఉన్న స్త్రీలు నుదుట కుంకుమ బొట్టు లేకుండా ఆలయంలోనికి ప్రవేశించరాదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.విధంగా ఆలయంలోనికి ప్రవేశించినప్పుడు ఈ పనులను చేయకుండా, మన మనస్సును పూర్తిగా దేవునిపై ఉంచినప్పుడు మనలోని బాధలు తొలగిపోయి మనసు తేలికగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
మానసిక ప్రశాంతత కోసమే కొందరు దేవాలయాలకు వెళ్లడం మనం చూస్తుంటాము.