వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తెగా , జగన్ సోదరిగా వైస్ షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అక్రమాస్తుల కేసులో జగన్ జైలు పాలయినప్పుడు షర్మిల పాదయాత్ర చేపట్టి, వైసీపీకి మంచి ఊపు తీసుకువచ్చారు.
ప్రస్తుతం ఏపీ లో వైసీపీ అధికారంలో కొనసాగుతోంది.దీంతో షర్మిలకు కీలకమైన పదవి జగన్ కట్టబెడతారు అని భావించిన ఆమెకు జగన్ మొండిచేయి చూపించారు.
ఇప్పుడు చూస్తే ఆమె తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఇప్పటికే కీలకమైన సమావేశాలు నిర్వహించారు.
జిల్లాల పర్యటనలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అతి త్వరలోనే షర్మిల తమ పార్టీ పేరును ప్రకటించేందుకు సిద్ధమవుతున్న సమయం లో ఆమె పై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి.
అసలు తెలంగాణ లో పులివెందుల రాజకీయాలు ఏంటి ? అసలు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టేందుకు ఏం అర్హతలు ఉన్నాయి ? ఆంధ్ర పెత్తనం తెలంగాణ లో కుదరదు అంటూ పెద్ద ఎత్తునే విమర్శలు రాజకీయ ప్రత్యర్ధులు మొదలుపెట్టారు.రానున్న రోజుల్లో ఇది కూడా ఇబ్బందికరంగా మారనున్న తరుణంలో షర్మిల వ్యూహాత్మకంగా తెలంగాణ కోడలు అనే అస్త్రాన్ని బయటకు తీశారు.
తనపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న వారికి సమాధానంగా ఈ అస్త్రాన్ని షర్మిల ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు.షర్మిల భర్త అనిల్ కుమార్ హైదరాబాద్ కు చెందినవారు.హైదరాబాదులోనే ఇప్పటికీ ఉంటున్నారు.దీంతో తాను తెలంగాణ కోడలిని అని, తాను తెలంగాణకు చెందిన వ్యక్తిని అవుతాను అని, తనకు ఇక్కడ పార్టీ పెట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, తనపై విమర్శలు చేస్తున్న వారికి గట్టి సమాధానం ఇచ్చేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే షర్మిల ప్రధాన అనుచరులు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, రానున్న రోజుల్లో షర్మిల రాజకీయానికి ఇబ్బంది లేకుండా చూసుకునే పనిలో ఉన్నారు.