సీతారాములకు ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలలో భద్రాచలం ఎంతో పేరు గాంచినది.
రెండు రాష్ట్రాలు విడిపోక ముందు శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలంలో ఎంతో ఘనంగా జరిగేవి.అయితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి కళ్యాణం జరిపిస్తారు.ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణం శ్రీ రామ నవమి రోజు కాకుండా పౌర్ణమి రోజు జరిపిస్తారు.
అదేవిధంగా అన్ని ఆలయాలలో కల్యాణం మధ్యాహ్నం జరిగితే ఒంటిమిట్టలో మాత్రం రాత్రి జరుగుతుంది.ఈ విధంగా పౌర్ణమి రోజు రాత్రి సమయంలో స్వామివారి కల్యాణం జరగటానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు వడ్డె కులానికి చెందిన సోదరులు దోపిడీ చేస్తూ, దోచుకుంటూ కర్కషమైన జీవితం సాగించేవారు.
ఒకనాడు కలలో శ్రీరాముడు కనిపించి వారికి జ్ఞానోదయం కల్పించిన తర్వాత వారు స్వామి వారి గర్భగుడిని నిర్మించి భక్తిశ్రద్ధలతో పూజించే వారు.ఈ విధంగా ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఆలయంలో వెలసిన సీతా రామలక్ష్మణులు ఏక శిలా నిర్మితాలు.ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి సీతారాముల గర్భగుడిలో కాకుండా ప్రత్యేకంగా సంజీవరాయుడుగా కొలువై ఉన్నాడు.
ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణం పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెలలో కళ్యాణం జరగడం ప్రత్యేకం.
పురాణాల ప్రకారం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వివాహం పగటి సమయంలో జరుగుతుంది.పగటి సమయంలో వారి వివాహం చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు విష్ణుమూర్తిని కోరగా అందుకు విష్ణుమూర్తి రామావతారంలో నీ కోరిక తీరుస్తానని వరమిస్తాడు.అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు నిండు పున్నమి వెన్నెల సాక్షిగా వివాహం జరిపిస్తారు అని పురాణాలలో పేర్కొంది.
నవమి ముందు రోజు నుంచి 11 రోజుల పాటు ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగి పౌర్ణమిరోజు రాత్రి స్వామివారి కల్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
DEVOTIONAL