పల్లె ప్రకృతి వనంలో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం ఖానాపురం శివారులో పల్లె ప్రకృతి వనానికి గాను సుమారు 6 ఎకరాలు కేటాయించారు.ఇప్పుడు ఈ స్థలంపై మట్టిమాఫియా కన్నుపడింది.

ఎలాంటి అనుమతులు లేకుండా యధేచ్చగా జెసిబితో మట్టిని తవ్వి అక్రమంగా ప్రైవేట్ వెంచర్లకు తరలిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నా అడిగే వారే కరువయ్యారు.అక్రమ మట్టి రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతున్నా, గ్రామస్తులు పలుమార్లు ఎమ్మార్వోకి వినతిపత్రం అందించినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అధికార,ప్రతిపక్ష స్థానిక నేతల అండదండలతోనే మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని వాపోతున్నారు.అనంతగిరి ఎమ్మార్వో బదిలీపై వెళ్లగా ఇదే అదునుగా భావించి ఉదయం,మధ్యాహ్నం, సాయంత్రం అధికారులు లేని సమయం చూసి గంటల వ్యవధిలోనే అక్రమ మట్టి తరలింపు జరుగుతుందని అంటున్నారు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పల్లె ప్రకృతి వనంలో నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఇదే విషయమై సంబంధిత రెవిన్యూ అధికారులకు చరవాణి ద్వారా వివరణ కోరగా మట్టి తోలుకుంటే ఏం చేద్దామని విలేకరినే ప్రశ్నించడం గమనార్హం.

Advertisement
షాకింగ్ వీడియో : తలుపు తీయగానే కాటేసిన పాము..

Latest Suryapet News