రాజన్న సిరిసిల్ల జిల్లా : మహాత్మా జ్యోతిరావుపూలే నవతరానికి ఆదర్శప్రాయుడని వారి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని,మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశం గర్వించే గొప్ప మహానీయుల్లో పూలే ఒకరన్నారు.
అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని గుర్తు చేశారు.సామాజిక న్యాయం,ధ్యేయం పేరుతో ఉద్యమాలు నడిపి తనవంతుగా సహకరించేవారన్నారు.
స్త్రీల విద్య అవసరాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించారన్నారు.మూఢ నమ్మకాలపై సమరశంఖం పూరించారన్నారు.
సమాజంలో సగభాగంగా ఉన్న స్ర్తీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని భావించిన ఫూలే ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపి అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు.1848 లో బాలికల కొరకు పాఠశాలను స్థాపించి,ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడమే కాకుండా తన భార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేసిన మహోన్నత వ్యక్తి పూలే అని,రానున్న తరాలకు పూలే, సావిత్రి బాయిల జీవితం స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.