టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ మేరకు రూ.లక్ష పూచీకత్తు రెండు షూరిటీలతో నాలుగు వారాల పాటు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చింది.ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కొన్ని షరతులను విధించింది.సాక్షులను ప్రభావితం చేయకూడదని, కేసుకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు ఎవరితో మాట్లాడకూడదన్న హైకోర్టు ఆయన ఆస్పత్రిలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు కోర్డు ఆర్డర్లు అందిన తరువాత సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.మరోవైపు చంద్రబాబు వెంట ఇద్దరు డీఎస్పీలను ఉంచుతామని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.
దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది.అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా చంద్రబాబును సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్ట్ చేయగా సుమారు 52 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.