నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు...!

నల్లగొండ జిల్లా: పెద్దవూర మండలం కుంకుడుచెట్టు గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

పంట పొలాల్లో నాలా పర్మిషన్ లేకుండా ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తూ స్థానిక వనరులన్ని ఇష్టానుసారంగా కొల్లగొడుతూ ఏళ్ళ తరబడి వ్యాపారాలు చేస్తున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటుక బట్టీ ఎర్పాటు చేయాలంటే ముందుగా గ్రామ పంచాయితీతో పాటు మైనింగ్, రెవెన్యూ, పరిశ్రమల, కార్మిక, విద్యుత్ రవాణా శాఖల నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.అన్ని అనుమతులు ఉన్నా జనావాసాలకు 5 కి.మీ.దూరంలో వ్యవసాయ భూమికి నాలా అనుమతి తీసుకున్న తర్వాతే ఇటుక బట్టీలు ఏర్పాటు చేసుకోని పనులు ప్రారంభించాల్సి ఉంటుంది.వీటిలో ఏ ఒక్క అనుమతి లేకున్నా సదరు నిర్వాహకునిపై చర్యలు తీసుకొని బట్టీలను సీజ్ చేసే అధికారం రెవెన్యూ అధికారులకు ఉన్నా,నేటికీ ఒక్కరిపైన కూడా చర్యలు చేపట్టలేదంటే ఇటుక వ్యాపారులకు,అధికారులకు మధ్య లోపాయికారి ఒప్పందం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Brick Kilns Against Norms Nalgonda District, Brick Kilns , Nalgonda District, Pe

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే 24గంటల విద్యుత్ ను ఇటుక బట్టీలకు వాడుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడని అంటున్నారు.పరిసర ప్రాంతాలలోని కుంటల్లో,చెరువుల్లో అక్రమంగా వందల కొద్ది మట్టిని తరలించి ఇటుకల తయారీకి ఉపయోగిస్తున్నా,గ్రామ సర్పంచ్,కార్యదర్శి పాలక వర్గాన్ని ఒప్పించి సానుకూల తీర్మానం చేసి ఇవ్వడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గ్రామానికి 5 కి.మీ.దూరంలో ఇటుక బట్టీలను ఏర్పాటు చేయాలనే నిబంధనలను బేఖాతర్ చేస్తూ గ్రామానికి కూతవేటు దూరంలోనే ఏర్పాటు చేయడంతో బట్టీలు కాల్చిన సమయంలో వెలువడే విషపూరిత పోగతో గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వాపోతున్నారు.ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇటుక బట్టిలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
మహిళల భద్రతకు ప్రత్యేక వాచ్...!

Latest Nalgonda News