ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యకు కేంద్రంగా ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియా ( Australia )ఒకటి.ప్రపంచస్థాయి విద్యాసంస్థలు, మెరుగైన జీవితం, ప్రశాంత వాతావరణం తదితర అంశాలతో ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్ధులను ( International students in Australia )ఆకర్షిస్తోంది.
అయితే వలసలు నానాటికీ పెరిగిపోతుండటంతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది.విదేశీ విద్యార్ధుల సంఖ్యను వచ్చే ఏడాది నుంచి 2,70,000కు పరిమితం చేయాలని నిర్ణయించింది.కొత్త పాలసీపై ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జాసన్ క్లేర్ ( Minister Jason Clare )మాట్లాడుతూ.2023 ఆర్ధిక సంవత్సరంలో 6 లక్షల స్టూడెంట్ వీసాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.ఇవి గతంతో పోలిస్తే చాలా ఎక్కువని క్లేర్ తెలిపారు.
కరోనా సమయంలో అన్ని దేశాల మాదిరిగానే ఆస్ట్రేలియా సైతం కార్మికుల కొరతను ఎదుర్కొంది.దీంతో ఆ దేశ ప్రభుత్వం వలసలను ప్రోత్సహించింది.నిబంధనలను సడలించి కార్మికులు, విద్యార్ధులు ఆస్ట్రేలియా వైపు వచ్చేలా చర్యలు తీసుకుంది.
అయితే అప్పటికే గృహ సంక్షోభం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియాపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపింది.ఈ నేపథ్యంలో విద్యార్ధి, నైపుణ్యం కలిగిన వ్యక్తుల వలసలను నియంత్రించాలని నిర్ణయం తీసుకుంది.
కేవలం స్కిల్డ్ పర్సన్స్‌కే శాశ్వత నివాసం కల్పించాలని యత్నాలు ప్రారంభించింది.
దీనిలో భాగంగా ఆస్ట్రేలియాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్ధులు, తక్కువ నైపుణ్యం కలిగిన వారి వీసాలపై నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించింది.యూనివర్సిటీల్లో 1,45,000 .స్కిల్ ట్రైనింగ్ సెక్టార్‌లో 95 వేల మంది విదేశీ విద్యార్ధులను అనుమతించేలా నిబంధనలు తీసుకొస్తున్నట్లు మంత్రి జాసన్ క్లేర్ పేర్కొన్నారు.వలసలపై ఆ దేశ ప్రధాని మాట్లాడుతూ.ఆస్ట్రేలియాలో పరిస్ధితులు ఆందోళనకర స్ధితికి చేరుకున్నాయని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.అయితే అంతర్జాతీయ విద్యార్ధులపై ఆంక్షలు దేశ విద్యావ్యవస్ధపై ప్రభావం చూపుతాయని ఆస్ట్రేలియా యూనివర్సిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఇది ఆస్ట్రేలియా పరిశోధనా సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందని యూనివర్సిటీస్ ఆస్ట్రేలియా ఛైర్మన్ డేవిడ్ లాయిడ్ పేర్కొన్నారు.