ఏపీలో వీలైనంత తొందరగా బలపడడమే కాకుండా వచ్చే ఎన్నికలనాటికి అధికారం దక్కించుకోవాలనే ఆలోచనలో బీజేపీ అగ్ర నాయకులూ ఉన్నట్టుగా కనిపిస్తోంది.అందుకే ఇప్పటివరకు వైసీపీ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించిన బీజేపీ ఇక టార్గెట్ మొత్తం వైసీపీ మీద పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తోంది.
దీనిలో భాగంగానే టీడీపీతో పాటు వైసీపీలోని అసంతృప్తి నాయకులకు గేలం వేసి తాము బలపడాలని చూస్తోంది.టీడీపీ, బీజేపీ నాయకులకు ఆఫర్లు ఇస్తూ బీజేపీలో చేరితే మీ భద్రతకు ఢోకా ఉండదంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
పనిలో పనిగా వైసీపీలోని అసంతృప్తి నాయకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్లాన్ లు వేస్తున్నారు.భవితకు భద్రం, మీ క్షేమానికి మా భరోసా అనే నినాదంతో ముందుకెళ్ళాలని నిర్ణయించినట్టు సమాచారం.

ప్రస్తుత బీజేపీ నాయకుల తీరు చూస్తుంటే.2024 ఎన్నికల్లో వైసీపీతో పోరాటానికి బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.ఏపీలో బీజేపీ టీడీపీ పార్టీల మధ్య స్నేహ బంధం తెగిపోయిన తర్వాత వైసీపీ, బీజేపీ మధ్య స్నేహం పెరిగింది.2018లో బీజేపీ మూడు ముక్కలుగా ఉండేది.టీడీపీ అనుకూల బీజేపి, వైసీపీ అనుకూల బీజేపీ, పక్కా బీజేపీ గా గ్రూపులు ఉండేవి.అయితే కొద్దికాలంగా వైసీపీని సమర్ధించిన నాయకులు మెల్లిగా యూ టర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
G.V.L, విష్ణువర్దన్ రెడ్డి, రఘురాం వంటి నాయకులు నిన్నటి వరకు కొంత వైసీపీ కి అనుకూలంగా ఉండేవారు.ఇప్పుడు వాళ్ల కూడా ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఇక మొదటి నుంచి వైసీపీపై దూకుడుగానే వ్యవహరిస్తున్నఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరింతగా వైసీపీ మీద విమర్శలు బాణాలు ఎక్కుబెట్టారు.

ఇక ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేయడంలో బీజేపీ నేతలు సరికొత్త ఎత్తులకు శ్రీకారం చుట్టారు.నిధుల కొరతతో సతమతమవుతున్నవైసీపీ ప్రభుత్వాన్ని మరిన్ని చిక్కుల్లోకి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్ధలు కూడా రంగంలోకి దిగాయి.ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితిని ప్రశ్నిస్తూ లేఖలు రాయడం దీనిలో భాగంగానే కనిపిస్తోంది.
నిన్న స్టేట్ బ్యాంక్, నేడు హాడ్కో లేఖలు రాయడం ఈ కోవలోనివే అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.ఈ విధంగా లేఖలు రాయడం గతంలో ఎప్పుడూ లేదని, కేంద్రం అనుమతితోనే ఇలా జరుగుతోందని వైసీపీ నేతలు లోలోపల రగిలిపోతున్నారు.
ఈ లేఖల కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి దివాళ దిశగా వెళ్తోందని బీజేపీ ప్రచారానికి దిగడం ఇప్పుడు వైసీపీ నేతలకు మింగుడుపడడంలేదు.