గల్ఫ్ దేశం కువైట్( Kuwait )లో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటన దిగ్భ్రాంతి కలిగించింది.ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
ఇప్పటి వరకు 50 మంది మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి.అందులోనూ 40 మంది భారతీయులేనని సమాచారం.
వీరిలోనూ ఎక్కువమంది కేరళ వాసులే కావడంతో ఆ రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నారనే అనుమానంతో వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
మరోవైపు బాధితులకు అండగా నిలిచేందుకు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచింది.ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన ఆదేశాల మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్( Kirti Vardhan Singh ) కువైట్‌కు బయల్దేరి వెళ్లారు.
మరోవైపు.కువైట్‌లో అగ్నిప్రమాదం నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న కేరళకు చెందిన ఎంటెక్ గ్రాడ్యుయేట్ , కెమికల్ ఇంజనీర్ సాజన్ జార్జ్( Sajan George ) ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతని కుటుంబం ఆందోళన చెందుతోంది.అధికారుల నుంచి అధికారిక ధృవీకరణ పెండింగ్‌లో ఉండటంతో సంఘటన జరిగిన సమయంలో సాజన్ సదరు భవనంలో ఉండే అవకాశం ఉందని స్నేహితులు అతని తండ్రికి సమాచారం అందించారు.
కుటుంబ సభ్యులు ముందురోజే సాజన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.ఆ తర్వాతి నుంచి అతని నుంచి ఫోన్ రాకపోవడం, తాము ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
పునలూరుకు చెందిన సాజన్ నెల రోజుల క్రితమే ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లాడు.అంతకుముందు ఆయన కేరళలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.మొదటి జీతం అందుకున్న వెంటనే కుటుంబానికి కొంత డబ్బు పంపినట్లుగా బంధువులు తెలిపారు.
కాగా.జూన్ 12న తెల్లవారుజామున 4 గంటలకు ఆ భవనంలో మంటలు చెలరేగాయి.ప్రమాద సమయంలో అందులో 195 మంది వలస కార్మికులు నివసిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది కేరళ వాసులు మరణించడంతో .మృతిచెందిన, గాయపడిన వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కువైట్ వెళ్లనున్నారు.ఇవాళ ఉదయం జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.